ఆకలితో అలమటిస్తున్న తాము కరోనాయే బెటర్ అనుకుంటున్నామని వలస కార్మికులు అంటున్నారు. సుమారు 30 లక్షల మంది వలస కార్మికుల్లో అనేకమంది చేస్తున్న దయనీయ వ్యాఖ్యలివి.. మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ ఇంకా పలు రాష్ట్రాలకు చెందిన వీరు ఇంకా యూపీ లోని గోరఖ్ పూర్, బలియా వంటి ప్రాంతాల్లో బస్సులు, రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆకలి బాధను భరించలేకపోతున్నామని, కరోనాకు గురైతే కనీసం ఆహారమైనా లభిస్తుందని ఆశిస్తున్నామని వారు చెప్పారు. ప్రభుత్వం వెంటనే తమకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని వారు కోరుతున్నారు. ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు వంటి వాటిలో పని చేస్తూ వచ్చిన వీరు.. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తమ జాబ్స్ కోల్పోయారు. తమతమ స్వస్థలాల్లో చిన్నా, చితకా వ్యాపారాలు తమకు ఉన్నాయని, కానీ అవన్నీ మూత బడడంతో పొట్ట చేత బట్టుకుని ఇక్కడికి వచ్చామని వీరు వాపోయారు. లాక్ డౌన్ ఆంక్షలు సడలించారు గనుక మళ్ళీ తమ రాష్ట్రాలకు వెళ్లి తమ పనులు చూసుకుంటామని వలస కూలీలు తెలిపారు. కాగా-ఇంకా అనేకమంది తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు తహతహలాడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఎవరూ తమకు పని ఇవ్వడంలేదని, కనీసం తమ ప్రాంతాలకు వెళ్తే అయినా ఏదో ఒక పని దొరుకుతుందని భావిస్తున్నామని, తమ గ్రామాల్లో పొలం పనులు చేసుకుని అయినా బతుకుతామని ఈ వలస కూలీలు బావురుమన్నారు.