
తమిళనాడులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారికి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అంతేకాదు వారి ద్వారా కాంటాక్ట్ కేసులు కూడా నమోదవుతున్నాయి. తాజాగా తిరువళ్లూర్ జిల్లా కడంబత్తూర్ యూనియన్ పేరంబాక్కంకు చెందిన ఓ బట్టల వ్యాపారికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను అలర్ట్ చేశారు. సదరు వ్యాపారి.. గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్ సమావేశం వెళ్లి.. గత నెల 23వ తేదీన తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సదరు బాధితుడిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది.
కాగా.. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత.. 24 నుంచి 31వ తేదీ వరకు బట్టల షాపును తెరచి వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తెరచిఉన్న సమయంలో ఆ షాపులోకి ఎంత మంది కస్టమర్లు వచ్చారన్నది ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఆ ప్రాంతంలోని కాంటాక్ట్ కేసులను ఆరా తీస్తున్నారు. సదరు షాపులోకి వెళ్లిన వారంతా క్వారంటైన్‌లోవుండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.