
కరోనా, లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా సినీ ఇండస్ట్రీ పడుతున్న కష్టాలకు ఇక తెరపడనుంది. ఇప్పటికే తెలంగాణలో షూటింగ్స్ సహా సినిమా థియేటర్లు తెరవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తాజాగా , కేంద్రం కూడా టాలీవుడ్‌కు శుభవార్తనందించింది. దేశవ్యాప్తంగా సినిమా షుటింగ్‌లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. శనివారం (మే 23) సినీ ప్రముఖులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత సురేష్ బాబు, తేజ, జెమినీ కిరణ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారితో మాట్లాడుతూ.. తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకేసారి ఓపెన్ అయ్యేలా నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే పైరసీ కోసం కొత్త చట్టం చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం(మే 22న)రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్. శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి. కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు సీఎంను కలిశారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం కల్పించాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్..జూన్ నుంచి సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని టాలీవుడ్ కి హామీ ఇచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. దీంతో త్వరలోనే తెలుగు చిత్రపరిశ్రమలోని కళాకారుల, కార్మికుల కష్టాలు తీరనున్నాయని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.