భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువలో ఉంది. దేశంలో మొత్తం 880 మందికిపైగా కరోనా వైరస్ కారణంగా మరణించారు. ఇక సామన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఈ వైరస్ అందరినీ వెంటాడుతోంది. దీంతో ఈ కోవిడ్ బారి నుంచి తప్పించుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కార్యాలయ సిబ్బంది ఒకరికి కరోనా వైరస్ సోకింది.
దేశరాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిణ కొనసాగుతోంది. ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) విధులు నిర్వరిస్తున్న అధికారికి కరోనా వైరస్ సోకింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సదరు ఆఫీసర్‌ను క్వారంటైన్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. అతనితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 3న ముగియనుంది. మరోవైపు కేసులు సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా వైరస్ నియంత్రణ, లాక్‌డౌన్ పొడిగింపు, ఆంక్షల దశలవారీగా సడలింపు, ఆర్ధిక వ్యవస్థ పునఃప్రారంభం తదితర అంశాలను ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం కేంద్రం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.