కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. పరీక్షలు వద్దంటున్నారు CBSE విద్యార్థులు. అయితే పరీక్షలు పెట్టాల.. వద్దా అనే అంశంపై సందిగ్ధంలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అయితే కోవిడ్ వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్న కేంద్రం.. ఈసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండదని మాత్రం ప్రకటించింది.
అయితే ఇప్పటికే పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో ఉంచుకుని CBSE 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయాలంటున్నారు విద్యార్థులు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మే నెలలో జరగబోయే బోర్డు పరీక్షలు రద్దు చేయాలని, లేదా వాటిని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కేంద్రాన్ని కోరుతూ స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లో పిటిషన్ పెట్టిన సంగతి తెలిసింది.
మే 04న జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలు యథాతథంగా జరుగుతాయా .. లేదా.. అనే అంశంపై ఉంత్కఠ వీడటం లేదు. ఈ పరీక్షలను వాయిదా వేసే అవకాశం లేదని.. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా భారీగా పెంచే ఆలోచనల్లో ఉన్నట్లుగా CBSE Board అధికారి ఒకరు ఓ మీడియాకు తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే పరీక్షా కేంద్రాలను కూడా 40 నుంచి 50శాతం పెంచాం. నిబంధనలు పాటించేలా సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నాం ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం వార్షిక పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
అయితే పలు రాజకీయ పార్టీలతో పాటు పలు రాష్ట్రాలు సైతం మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్నందున ఇలాంటి ప్రస్తుత తరుణంలో CBSE పరీక్షలు వాయిదా వేయాలని CBSE బోర్డుతోపాటు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఈ అంశంపై చర్చించేందుకు సీబీఎస్ఈ బోర్డు, కేంద్ర విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ భేటీలో పరీక్షల వాయిదా అంశం చర్చకు వచ్చినప్పటికీ.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ అధికారి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 7 వరకు జరగాల్సి ఉండగా.. 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 15 వరకు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో.. పరీక్షలు వాయిదా వేయాలని కొందరు విద్యార్థులు, రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని విద్యార్థులు ఉత్కంఠతో ఎదిరి చూస్తున్నారు.