Andhra Pradesh Coronavirus Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి మెల్లమెల్లగా విస్తరిస్తోంది. కొంతకాలం నుంచి భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. మళ్లీ వందమార్క్ ను దాటుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మొదలైందన్న నిపుణుల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై మహమ్మారిని అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 8,90,692 కి పెరగగా.. మృతిచెందిన వారి సంఖ్య 7174 కి చేరింది. గత 24 గంటల్లో 58 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,82,520 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 998 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదిలాఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 45,702 నమూనాలను పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,36,179 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
Also Read: