Covid Vaccine: కరోనా మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో రోజువారీ కేసులు రెండున్నర లక్షలు దాటేశాయి. అయితే కరోనాను అంతమొందించే ఏకైక అస్త్రం వ్యాక్సిన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని నమ్మిన ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో ప్రారంభంలో కొన్ని అపోహలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అవన్నీ పటాపంచలవుతున్నాయి. అందరూ వ్యాక్సినేషన్ చేసుకుంటారు. అయితే ఇప్పటికీ గర్భిణీల్లో కొన్ని అనుమానాలు అలానే ఉన్నాయి. గర్బిణీలు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది.? ఏ సమయంలో తీసుకోవాలి.? లాంటి విశేషాలను పంచుకున్నారు నొయిడాలోని అపోలో ఆసుపత్రికి చెందిన గైనకాలజిస్ట్ మిథీ భానోట్.
గర్భిణీలకు వ్యాక్సినేషన్ విషయమై డాక్టర్ మాటల్లోనే.. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు గర్భిణీలకు కేవలం 2.78 కోట్ల డోసులు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. 1.59 కోట్ల మందికి మొదటి డోస్ ఇవ్వగా 1.19 కోట్ల మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకొని గర్భిణీలు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి కూడా వ్యాక్సిన్ సోకే ప్రమాదం పొంచి ఉంది. అయితే కొందరు మహిళలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే జ్వరం.. పుట్టబోయే బిడ్డలపై ప్రభావం చూపుతుందనే అపోహలో ఉన్నారు. దీంతో వ్యాక్సినేషన్‌కు వెనుకడుగు వేస్తున్నారు. అయితే గర్భిణీలు టీకాలు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని డాక్టర్ అభిప్రాయపడ్డారు.
గర్భిణీలు ఏ సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలనే విషయంపై ఇంకా ఎలాంటి అధ్యయనాలు లేకపోవడంతో ఇదే సరైన సమయమని చెప్పడం కష్టం. అయితే వ్యాక్సిన్‌కు మొదటి మూడు నెలలు దూరంగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు. మొదటి దశలో పిండం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంటుంది కాబట్టి గర్భిణీలు మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం.
గర్భిణీలు కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌లలో దేనిని తీసుకున్న ఇబ్బందులు ఎదురుకావు. కానీ గతంలో శరీరంలో రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యను ఎదుర్కొన్న వారు మాత్రం కోవాక్సిన్ తీసుకుంటే ఉత్తమం. ఇక గర్భిణీలు కచ్చితంగా కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. మాస్కులు ధరించడం, చేతులు నిత్యం శుభ్రం చేసుకోవడం చేస్తుండాలి.
గర్భిణీలు వ్యాక్సిన్ తీసకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయనే అపోహలు ఉన్నాయి కానీ వీటిలో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. పాలిచ్చే తల్లులు కూడా ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. తల్లుల్లో తయారయ్యే రోగ నిరోధకాలు చిన్నారులకు కూడా చేరుతాయని నిపుణులు చెబుతున్నారు.
కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత గర్భం దాల్చవచ్చా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి నిపుణులు నిస్సందేహంగా దాల్చవచ్చని చెబుతున్నారు. అయితే కోవిడ్ సోకి తగ్గిన తర్వాత మూడు నెలలు గ్యాప్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అదే గర్భం దాల్చిన వెంటనే వైరస్ సోకితే గర్భాన్ని కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. మంచి పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే సులభంగా సమస్యలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు.
Also Read: Agriculture News: పంట మార్పిడి పాటిస్తే రైతుల ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.. ఎలాగంటే..?