
చెన్నైలో 97 ఏళ్ల వృద్ధుడు కరోనాని జయించాడు. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తరువాత కరోనా వైరస్ నుండి 97 ఏళ్ల వ్యక్తి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. మే 30వ తేదీ 97 ఏళ్ల కృష్ణ మూర్తి అనే వ్యక్తి జ్వరం, జలుబు, దగ్గుతో పాటు తేలికపాటి శ్వాస ఇబ్బందితో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అలాగే అతను గత కొన్ని సంవత్సరాలుగా హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ వంటి కొమోర్బిడ్ వ్యాధులతో కూడా బాధపడుతున్నాడని హాస్పిటల్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కృష్ణమూర్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు. కాగా శుక్రవారం కూడా 97 ఏళ్ల వయసున్న ఆగ్రా వ్యక్తి కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
కాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉంది. ఒక్క రోజులేనే 11,458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993 ఉండగా.. 1,54,330 మంది డిశ్చార్జి అయ్యారు. 8,884 మంది మరణించగా.. 1,45,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మే 19నాటికి దేశంలో లక్ష కేసులు నమోదు కాగా, జూన్ 3నాటికి రెట్టింపు అయ్యాయి. ఇక మరో పది రోజుల్లోనే ఆ కేసులు 3 లక్షలకు చేరడం గమనార్హం. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా రికవరీ రేటు భారత్‌లో ఎక్కువగా ఉండటం ఆనందించాల్సిన విషయం.