Telangana Police Physical Standard Details 2022: తెలంగాణలో భారీ ఎత్తున పోలీస్ నియామక ప్రక్రియ కొనసాగుతున్న తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈసారి ఆరు నోటిఫికేషన్లలోని మొత్తం 17,281 పోలీస్ నియామకాలు నిర్వహిస్తోంది. ఐతే పోలీస్ కొలువుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి పీఎంటీ, పీఈటీలాంటి శారీరక సామర్థ్య పరీక్షలకు (Physical Test 2022) హాజరైతే సరిపోయేలా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) కార్యాచరణ రూపొందించింది.
గతంలో మాదిరిగానే..
గతంలో జరిగిన నియామకాల్లో ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని మార్లు ఈ పరీక్షలకు హాజరు కావాల్సివచ్చేది. 2018లో తొలిసారిగా రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. అయితే తాజాగా చేపట్టిన నియామకాల్లో ఈ విధానంలో మార్పు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ క్రితం సారి విధానాన్నే కొనసాగించనున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. అభ్యర్థులు ఒకసారి పాల్గొన్న పరుగుపందెం, షాట్‌పుట్, లాంగ్‌జంప్ లాంటి పోటీలే కాకుండా వారి శారీరక కొలతల ఫలితాల్ని మూడు నెలలపాటు పరిగణనలోకి తీసుకోనున్నట్లు టీఎస్‌ఎల్పీఆర్బీ ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.
దరఖాస్తుల వెల్లువ..
కాగా పోలీస్ శాఖ విడుదల చేసిన వివిధ నోటిఫికేషన్లకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. క్రితం సారి దాదాపు 6 లక్షల వరకు రాగా.. ఈసారి ఇప్పటికే పది లక్షలకుపైగా వచ్చాయి. గడువు మరో అయిదు రోజులు మిగిలి ఉండటానికి తోడు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. వయోపరిమితి పెంపుతో లక్ష వరకు దరఖాస్తు చేస్తారని టీఎస్‌ఎల్పీఆర్బీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో క్రితం సారితో పోల్చితే దాదాపు రెట్టింపు దరఖాస్తులు నమోదయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షల కారణంగా సుమారు 40 శాతం(5లక్షల) మందికి ఊరట కలిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. క్రితం సారి వచ్చిన దరఖాస్తుల తీరుతెన్నుల దృష్ట్యా ఈ అంచనా నెలకొంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.