TS Jobs: తెలంగాణలో ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలకు పెద్ద ఎత్తున నోటిఫికేషన్‌లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1, పోలీసు శాఖకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అలాగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెన్‌ను కూడా నిర్వహించేందుకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తం 12,755 ఖాళీలకు గాను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా 10,028 పోస్టులు, ఇతర పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ విషయమై ఆర్థిక, అరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఈ విషయమై హరీశ్‌రావు సోమవారం మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకటి రెండు రోజుల్లో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపిఎం విభాగాల్లో మొత్తం 1326 పోస్టులు మెడికల్ బోర్డు ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు. కరోనా కాలంలో సేవలందించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వాలని మంత్రి తెలిపారు.
ఆయుష్షు విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. టెక్నికల్ పోస్టులతో పాటు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, నిమ్స్‌లోనిని ఖాళీలను నిమ్స్ బోర్డు, మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టి పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు.
ఆయుష్ విభాగంలోని స్టాఫ్ నర్సుల పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా కాకుండా, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 34, 35ను సవరించి నియామకాలు చేపట్టాలన్నారు. స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలన్నారు. 80 శాతం రాత పరీక్షకు మార్కులు, 20 మార్కులు కోవిడ్ కాలంలో పని చేసిన వారికి వెయిటేజి మార్కులు ఇవ్వాలన్నారు.
అలాగే ఆయుష్ డాక్టర్స్‌ను టీచింగ్ స్టాఫ్‌గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, అందులో ఏర్పడే ఖాళీలను వచ్చే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయుష్ సర్వీసు రూల్స్‌లో సవరణలు చేయాలన్నారు. ప్రయివేట్ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ సవరణలు చేయాలని మంత్రి హరీశ్ రావు వైద్య శాఖాధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ఎంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారు. ఎం పని చేస్తున్నారు. అన్న అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎన్. హెచ్ఎం. డైరెక్టర్ శ్వేతా మహంతిని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు 330 కోట్ల రూపాయలను స్టైఫండ్ గా ఇస్తున్నామని, వారి సేవలు చక్కగా వినియోగంచుకునేలా విధి విధానాల రూపకల్పన చేయాలని తెలిపారు. హరీశ్ రావు నిర్వహించిన ఈ సమావేశానికి హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, డీఎంఇ రమేష్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..