TG EAPCET 2025 Applications: ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ.. కేవలం 5 రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే?

తెలంగాణ ఈఏపీసెట్‌కు సంబంధించి కన్వీనర్‌ కోటా సీట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో 100 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకే రిజర్వుచేస్తూ జీవో జారీ చేశారు. ఇక మార్చి 1వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవగా కేవలం 5 రోజుల్లోనే దరఖాస్తులు వెళ్లువెత్తాయి..

TG EAPCET 2025 Applications: ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ.. కేవలం 5 రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే?
TG EAPCET 2025 Applications

Updated on: Mar 06, 2025 | 2:39 PM

హైదరాబాద్‌, మార్చి 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఈఏపీసెట్‌ 2025కు గత శనివారం నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్చి 1వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అయితే కేవలం ఐదు రోజుల్లోనే ఊహించని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 48,158 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు ఈఏపీసెట్‌ కో కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌ రెడ్డి తెలిపారు. వీరిలో 31,805 మంది ఇంజినీరింగ్, 16,317 మంది అగ్రికల్చర్‌-ఫార్మసీ, మరో 36 మంది రెండు విభాగాల పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

కాగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 4, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రూ.2,500, రూ.5 వేల ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారికి హైదరాబాద్‌లోని జోన్‌ 4లో మాత్రమే పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారని ఇప్పటికే నోటిఫికేషన్‌లో ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల సవరణలకు ఏప్రిల్ 6 నుంచి 8 వరకు అవకాశం ఉంటుంది. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 9వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్ధులకు తప్పనిసరిగా 2025 డిసెంబరు 31 నాటికి 16 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ టెక్నాలజీతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్‌ కోర్సులకు 2025 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఈ కోర్సుల్లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీలకు 25, ఇతరులకు 22 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితి నిర్ణయించారు. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏపీలోని విజయవాడ, కర్నూలు పరీక్ష కేంద్రాలను రద్దు చేస్తూ ఇప్పటికే ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 15 శాతం నాన్‌ లోకల్‌ కోటాలో ప్రవేశాలు పొందేందుకు ఏపీ విద్యార్థులకు ఇకపై అనుమతి లేదని తేల్చి చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.