
హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ కీలక మార్పులు చేసింది. ఉద్యోగ నియామకాలు వేగవంతంగా చేపట్టేందుకు ఇకపై ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను పిలవనుంది. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ఈ మేరకు అభ్యర్ధులను ఎంపిక చేయనుంది. ఇప్పటికే 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఈ విధానాన్ని అమలు చేసింది. గతంలోనూ మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో తదితర పోస్టుల భర్తీకీ ఇదే విధానం అనుసరించింది. ఇకపై వచ్చే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించింది.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు నిర్వహించి, అందులో సాధించిన మార్కులు, మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు. అనంతరం అభ్యర్థులను మల్టీజోనల్, జోనల్ పోస్టులకైతే 1:2 నిష్పత్తిలో, జిల్లా పోస్టులకైతే 1:3 నిష్పత్తి, దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో అభ్యర్ధులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల టీజీపీఎస్సీ భర్తీ చేసిన పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు పిలవగా నూటికి నూరు శాతం హాజరైనట్లు సమాచారం. ఇలా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలవడం మూలంగా మిగిలిన సగం మందిలో అనవసరంగా ఆశలు కల్పించినట్లు అవుతోంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరైనా పోస్టులు దక్కని వార నిరాశకులోనై మానసిక ఆందోళనకు గురై కొన్నిసార్లు విపరీత నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.
ఈ సమస్యలు తలెత్తకుండా ఒకేసారి 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను పిలవాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అంతేకాకుండా ఎక్కువ మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలవడం వల్ల రోజుల తరబడి భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ జాప్యంకి అడ్డుకట్ట వేసేందుకు తాజా సంస్కరణలు తీసుకువచ్చింది. ద్రువపత్రాల పరిశీలన సమయంలో అభ్యర్ధుల వద్ద అర్హతపత్రాలు ఉంటే వారికి ప్రాథమికంగా ఉద్యోగం వచ్చినట్లే. పరిశీలనలో సరైన అర్హతలు, రిజర్వేషన్ ప్రకారం అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేనట్లు వెల్లడైనా, గైర్హాజరైనా తదుపరి మెరిట్ అభ్యర్థిని పరిశీలనకు పిలుస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.