హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 4 పేపర్లకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1, 3 పరీక్షలు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు తాజాగా ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులను టీజీపీఎస్సీ భర్తీకి గత ఏడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. మరోవైపు గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదలయ్యాక ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి.
దీనిపై ఇప్పటి వరకు స్పదించని రేవంత్ సర్కార్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటుంది. గత డీఎస్సీలో కూడా ప్రభుత్వం ఇలాంటి వైఖరే అనుసరించింది. డీఎస్సీ పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలు చేపట్టినా.. కనీసం పట్టించుకోకుండా మొండి వైఖరితో పరీక్షలు నిర్వహించింది. కనీసం గ్రూప్ 2 పోస్టుల పెంపు విషయంలో అయినా సర్కార్ కరుణిస్తుందేమోనని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వ తీరు ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..