TGPSC Group 1 Mains: తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష.. పలువురు పరీక్షకు దూరం! కారణం ఇదే

|

Oct 21, 2024 | 6:04 PM

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పటిష్ట భద్రత నడుమ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. తొలి రోజు ఎంత మంది హాజరయ్యారంటే..

TGPSC Group 1 Mains: తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష.. పలువురు పరీక్షకు దూరం! కారణం ఇదే
TGPSC Group 1
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్ 21: తెలంగాణలో తొలి రోజు నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తొలిరోజు పరీక్షకు మొత్తం 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం (అక్టోబరు 21వ తేదీన) అర్హత పరీక్ష అయిన జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్ నిర్వహించారు. అక్టోబర్‌ 27వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఒక్క నిమిషం నిబంధన అమలు చేయడంతో ఈ రోజు జరిగిన పరీక్షకు పలువురు అభ్యర్ధులు దూరమయ్యారు. చాలా మంది ఆయా పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా రావడంతో గేట్లు మూసివేశారు. దీంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. మధ్యాహ్నం మధ్యాహ్నం 1.30 గంటల తరువాత కేంద్రంలోకి అనుమతించారు. 2 గంటల తర్వాత వచ్చిన పలువురు పరీక్షకు దూరమయ్యారు. సికింద్రాబాద్ పీజీ కళాశాలకు నిమిషం ఆలస్యం వచ్చిన అభ్యర్థిని పోలీసులు లోనికిపంపలేదు. దీంతో అతడు గోడదూకే ప్రయత్నం చేశాడు. అధికారులు గుర్తించి పోలీస్‌ స్టేషన్కు తరలించారు. కోఠి మహిళా కళాశాల పరీక్షా కేంద్రానికి 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ యువతిని సైతం అధికారులు లోపలికి అనుమతించలేదు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవగా.. సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగింది.

పరీక్షలను వాయిదా వేయాలంటూ పలువురు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అన్ని కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించారు. పరీక్ష గది, చీఫ్‌ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ టీజీపీఎస్సీ కార్యాలయ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పర్యవేక్షణ చేశారు. హైదరాబాద్ జిల్లాలో 5,613 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. వారిలో కేవలం 4,896 మంది మాత్రమే హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 87.23 శాతం హాజరైనట్టు ఆర్డిఓ జైపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు.

కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అన్ని చోట్ల ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్‌ జిల్లాలో 27 చొప్పున పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేడు ఇంగ్లిష్‌ పరీక్ష పూర్తికాగా ఇంకా 6 పేపర్లకు పరీక్షలు జరగాల్సి ఉంది. అక్టోబర్‌ 22వ తేదీన పేపర్‌ 1 జనరల్‌ ఎస్సే పరీక్ష, 23వ తేదీన పేపర్‌ 2 హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ పరీక్ష, 24వ తేదీన పేపర్‌ 3 ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్‌ పరీక్ష, 25న పేపర్‌ 4 ఎకానమీ, డెవలప్‌మెంట్‌ పరీక్ష, 26వ తేదీన పేపర్‌ 5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ పరీక్ష, 27వ తేదీన పేపర్‌ 6 తెలంగాణ పోరాటం, రాష్ట్ర ఏర్పాటు పరీక్ష జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.