హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2024) దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. నవంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20వ తేదీతో ముగియనుంది. ఈ ఏడాది రెండోసారి టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే గతంతో పోల్చితే ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)పై ఏటా ఆసక్తి తగ్గుతుందని తెలుస్తుంది. అందుకు కారణం టెట్‌కు వస్తున్న దరఖాస్తులే. టెట్ 2024కు ఇప్పటి వరకు 1.26 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
2022లో రెండు పేపర్లకు 4.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా, 2023లో 2.86 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఓసారి జరిపిన టెట్‌కు ఏకంగా 6.28 లక్షల మంది దరఖాస్తు చేశారు. అయితే ప్రస్తుత టెట్ దరఖాస్తుల గడువు నవంబర్ 20వ తేదీతో ముగియనుంది. శనివారం వరకు టెట్ పేపర్ 1కు 39,741, పేపర్ 2కు 75,712, రెండు పేపర్లకు కలిపి 10,599 చొప్పున మొత్తంగా 1,26,052 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇది వరకైతే టెట్ నిర్వహించినప్పుడల్లా 4 నుంచి 6 లక్షల మంది వరకు దరఖాస్తు చేసేవారు. నిరుద్యోగులతోపాటు ఈ ఏడాది నుంచి కొత్తగా సర్వీస్ టీచర్లు కూడా టెట్‌కు హాజరవుతున్నారు. పదోన్నతులు కావాలంటే వారంతా టెట్ తప్పనిసరిగా పాసై ఉండాలి.
ఈ నేపథ్యంలో టెట్‌కు హాజరయ్యే వారి సంఖ్య మరింత పెరగాలి. కానీ ఇందుకు విరుద్ధంగా అంతంత మాత్రంగా దరఖాస్తులు వస్తున్నాయి. మరోవైపు టెట్ వ్యాలిడిటీ గతంలో ఏడేండ్లు ఉండేది. ప్రస్తుతం దీనిని జీవితకాలం పొడిగించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు మళ్లీ టెట్ రాసేందుకు దూరంగా ఉంటున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 7032901383, 90007561 78 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.