హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీతో ముగిశాయి. పదో తరగతి పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పలు జిల్లాల నుంచి సేకరించిన జవాబు పత్రాలను అధికారులు స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. జవాబు పత్రాల కోడింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియ అనంతరం పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఫలితాల ప్రాసెసింగ్ మరో రెండు వారాల పాటు కొనసాగుతుంది. కాగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తగా 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దాదాపు 2,676 పరీక్ష కేంద్రాలలో నిర్వహించగా.. అక్కడక్కగా కొన్ని మాల్ ప్రాక్టీస్ సంఘటనలు జరిగినప్పటికీ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 2,676 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2,676 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులతో పాటు 30,000 మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖ నియమించింది.
పరీక్షల పర్యవేక్షణ, అవకతవకలను నివారించడానికి 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా నియమించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ పోర్టల్ నుంచి రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.