
హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను తాజాగా రాష్ట్ర డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ప్రస్తుతం పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు అక్టోబరు 30వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తన ప్రకటనలో తెలిపింది. నవంబర్ 13వ తేదీ లోపు విద్యార్ధులు తమ పాఠశాలల్లోని హెడ్‌మాస్టర్లకు ఫీజు చెల్లించాలని తెలిపింది. ఇక పాఠశాలల హెచ్‌ఎంలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14వ తేదీలోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18 లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక ఫీజుల విషయానికొస్తే రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీవరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల దరఖాస్తు గడువు పొడిగిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ తాజాగా ప్రకటనల వెలువరించింది. తాజా ప్రకటన మేరకు అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. మొత్తం 7,565 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి ఈ ఏడాది సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు అక్టోబర్ 21వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే దీనిని అక్టోబర్ 31వరకు పెంచుతూ ప్రకటన వెలువరించింది. ఇంటర్ అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్, మెజర్‌మెంట్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.