Half Day School Timings 2025: ఒంటి పూట బడుల కొత్త టైమింగ్స్‌ ఇవే.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?

ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు శనివారం (మార్చి 15) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పాఠశాలల పని వేళల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 7.45 గంటలకే పాఠశాలల్లో మొదటి గంట కొట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి సూచించారు..

Half Day School Timings 2025: ఒంటి పూట బడుల కొత్త టైమింగ్స్‌ ఇవే.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?
Half Day Schools

Updated on: Mar 16, 2025 | 2:03 PM

హైదరాబాద్‌, మార్చి 16: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు శనివారం (మార్చి 15) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాలల పని వేళల్లో కీలక మార్పులు చేస్తూ విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉదయం 7.45 గంటలకే పాఠశాలల్లో మొదటి గంట కొట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి సూచించారు. ఉదయం 7.50 గంటలకు స్కూల్‌ అసెంబ్లీ జరపాలని ఆదేశించారు. కాగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించి, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం అందించి పిల్లలను ఇంటికి పంపాలని ఇటీవల విద్యాశాఖ ఒంటి పూట బడులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పాఠశాలల్లో ఉదయం 8 గంటలకు మొదటి గంట కొట్టి, 8.15 గంటల నుంచి తరగతులు ప్రారంభించాలని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పందించిన విద్యాశాఖ శనివారం (మార్చి 15న) దీనిపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలు ఈ ఉత్తర్వులు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. అయితే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు మాత్రం సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్ధులకు తరగతులు నిర్వహించనున్నారు.

ఇలా అన్ని పాఠశాలల్లో ఏప్రిల్‌ 23 వరకు ఒంటి పూట బడులు కొనసాగుతాయి. ఆ తర్వాత అంటే ఏప్రిల్ 24వ తేదీన పేరెంట్స్‌ మీటింగ్‌ పెట్టి, విద్యార్ధులకు ప్రోగ్రెస్ కార్డులు అందించి వేసవి సెలవులు ప్రకటిస్తారు. వేసవి సెలవులు జూన్‌ 11 వరకు కొనసాగుతాయి. జూన్ 12 నుంచి తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.