సర్కార్‌ బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. ప్రతిరోజూ స్కూల్‌కి వెళ్తే దోసె, పూరీ, బోండా..

Telangana School Breakfast Scheme: రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు ప్రతిరోజూ ఉచిత అల్పాహారం అందించేందుకు వారాంత బ్రేక్‌ఫాస్ట్ మెనూను విడుదల చేసింది. దోసె, ఇడ్లీ, పూరీ, పొంగల్ వంటి పోషకాహార పదార్థాలతో పాటు పాలు, రాగి జావను కూడా అందించనున్నారు..

సర్కార్‌ బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. ప్రతిరోజూ స్కూల్‌కి వెళ్తే దోసె, పూరీ, బోండా..
Telangana Govt School Breakfast Scheme

Updated on: Jun 15, 2026 | 10:34 AM

హైదరాబాద్‌, జూన్‌ 15: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తి చేసింది. అకడమిక్‌ కేలండర్‌ను కూడా విడుదల చేసింది. బోధనతోపాటు ఈసారి ప్రతిరోజూ క్రీడలు నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. ఈ క్రమంలో బ్రేక్ ఫాస్ట్ మెనూ సైతం విడుదల చేసింది. మెనూ ప్రకారం ఏ రోజు ఏయే వంటకాలు విద్యార్ధులకు అందిస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

తెలంగాణ బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే..

  • సోమవారం దోసె-చట్నీ లేదా చపాతీ-కర్రీ
  • మంగళవారం మిల్లెట్ ఇడ్లీ-సాంబారు
  • బుధవారం పూరి-ఆలూ కుర్మా
  • గురువారం మిల్లెట్ ఇడ్లీ-సాంబారు
  • శుక్రవారం మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-చట్నీ
  • శనివారం బోండా-చట్నీ

ఉదయం పూట టిఫిన్‌తో పాటు మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి జావ అందిస్తారు. ప్రభుత్వ బడులతోపాటు కాలేజీల్లోనూ ఈ ఏడాది నుంచి ఉదయం అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచే అంటే ఈ రోజు నుంచే ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. కాలేజీల్లో దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొత్తం 1.44 లక్షల మందికి బ్రేక్‌ఫాస్ట్‌ అందించనున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచుతుందని విద్యాశాఖ భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 వేల స్కూళ్లలో 24 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 10 వేల వరకూ ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల్లో 36 లక్షల మంది చదువుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని రెండేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది విద్యావ్యవస్థలో పలు కీలక సంస్కరణలు తీసుకువచ్చారు.

Follow Us