TG Polycet 2026 Exam: రేపే తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పాలీసెట్ పరీక్ష బుధవారం (మే 13)న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పెన్ను, పేపర్ విధానంలో జరగనుంది. ఈ పరీక్షకు మొత్తం1.06 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తారు..

హైదరాబాద్, మే 12: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్ పరీక్ష రేపు (మే 13) జరగనుంది. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేసిన బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్ టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీ కార్డును తమతోపాటు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లవల్సి ఉంటుంది. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పాలీసెట్ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనుంది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 293 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సాంకేతిక విద్యశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు.
పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,06,439 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 56,494 మంది అబ్బాయిలు ఉండగా.. 49,945 మంది అమ్మాయిలు ఉన్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తారు. కాబట్టి విద్యార్ధులు తమ పరీక్ష కేంద్రాలకు ఉదయం 10 గంటలకే చేరుకోవల్సి ఉంటుంది. పరీక్ష ఆఫ్‌లైన్ (పెన్ను, పేపర్ విధానం) విధానంలో ఉంటుంది కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా తమ వెంట బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పెన్ తీసుకురావాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్‌పై ఫొటో ఫ్రింట్ లేకుంటే తమతోపాటు ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో, ఏదైనా ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్, వాచ్, కాలిక్యులేటర్ వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ మతించబోమని తెలిపారు.
రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..
పాలీసెట్ పరీక్షలో ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్ధులకు మ్యాథమెటిక్స్ నుంచి 60 మార్కులు, ఫిజిక్స్ నుంచి 30 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవసాయం, ఉద్యానవన, వేటరినరీ డిప్లొమా విద్యార్ధులకు అదనంగా జువాలజీలో మరో 30 మార్కులకు పరీక్ష ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




