
Telangana Police Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ప్రాథమిక రాత పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్సై స్థాయి పోస్టుల ప్రాథమిక రాత పరీక్షను నవంబరు 29న, కానిస్టేబుల్ స్థాయి పోస్టుల పరీక్షను డిసెంబరు 20న నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక-విపత్తు స్పందన, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి గత జులై 29న నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. విభాగాల వారీగా పోలీస్ శాఖలో 200 ఎస్సై/ఏఎస్సై, 4,800 కానిస్టేబుల్; స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 44 ఎస్సై, 1,380 కానిస్టేబుల్; అగ్నిమాపక శాఖలో 39 ఎస్సై, 751 కానిస్టేబుల్; జైళ్ల శాఖలో 15 ఎస్సై, 208 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వివరించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గరిష్ఠ వయోపరిమితిపై ఎస్సై, ఏఎస్సై, డ్రైవర్ పోస్టులకు 7 ఏళ్లు, ఇతర కానిస్టేబుల్ పోస్టులకు 10 ఏళ్ల సడలింపు నివ్వడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.13 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరిందని ఆయన తెలిపారు.
ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 16 వరకు 28 రోజుల పాటు బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించగా, ప్రక్రియ అత్యంత సమర్థవంతంగా పూర్తయిందని తెలిపారు. మొత్తం 4,29,000 మంది అభ్యర్థుల నుంచి 5,77,064 దరఖాస్తులు వచ్చాయని, సగటున ఒక్కో అభ్యర్థి 1.34 దరఖాస్తులు చేసినట్లు లెక్క తేలిందని శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 68.45 శాతం మంది ఒకే పోస్టుకు దరఖాస్తు చేసుకోగా, 28.88 శాతం మంది రెండు పోస్టులకు, 2.423 శాతం మంది మూడు, 0.2 శాతం మంది నాలుగు, 0.046 శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 1,35,359 మంది అభ్యర్థులకు ఉమ్మడి శారీరక పరీక్షల వల్ల కలిగిన పొదుపు ఆధారంగా ఫీజు రాయితీ అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
సామాజిక వర్గాల వారీగా అందిన దరఖాస్తులను పరిశీలిస్తే 49.19 శాతం బిసి, 43.60 శాతం ఎస్సీ/ఎస్టీ (వీరు 50% ఫీజు రాయితీ పొందారు), 7.20 శాతం ఓసీ దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. ఓసీల కేటగిరీలో 3.45 శాతం దరఖాస్తులు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల నుంచి వచ్చాయని చెప్పారు. అలాగే మొత్తం దరఖాస్తుల్లో పురుషుల నుంచి 4,30,844 (74.66%), మహిళల నుంచి 1,46,220 (25.33%) దరఖాస్తులు నమోదైనట్లు వెల్లడించారు.
నియామక ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, నకిలీ దరఖాస్తులను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను 97.4 శాతం మంది అభ్యర్థులు తమ మొబైల్స్ ద్వారా విజయవంతంగా పూర్తి చేశారని, సాంకేతిక సమస్యల వల్ల పూర్తి చేయలేకపోయిన మిగిలిన 2.6 శాతం మందికి ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు బోర్డు ఛైర్మన్ తెలిపారు. వారు ఆన్‌లైన్ లాగిన్‌లో ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతుందని స్పష్టం చేశారు. ఎస్సై సివిల్, కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు ప్రాథమిక పరీక్షతో ప్రారంభమయ్యే 3 దశల ఎంపిక విధానం ఉంటుందని, ఏఎస్సై ఎఫ్‌పీబీ (11,992 దరఖాస్తులు), డ్రైవర్ పిసి (12,495 దరఖాస్తులు), మెకానిక్ పిసి (2,465 దరఖాస్తులు) వంటి పోస్టులకు శారీరక పరీక్షలతో మొదలయ్యే 2 దశల ప్రక్రియ ఉంటుందని వివరించారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి 56.84 శాతం మంది తెలుగును, 43.02 శాతం మంది ఇంగ్లీషును, 0.12 శాతం మంది ఉర్దూను పరీక్ష మాధ్యమంగా ఎంచుకున్నారని తెలిపారు. నవంబరు 29న జరిగే ఎస్సై ప్రాథమిక పరీక్షను ఉమ్మడి 10 జిల్లాల కేంద్రాల్లో, డిసెంబరు 20న జరిగే కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షను 15 నుంచి 18 ప్రాంతాల్లో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాస రావు వివరించారు.
తెలంగాణ పోలీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళి, తరచుగా అడిగే అంశాలను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రిలిమినరీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే సమయంలో గత ప్రశ్నపత్రాల సాధనతో సమయపాలన, ప్రశ్నల స్థాయి, విభాగాలపై అవగాహన పెంచుకోవచ్చు.