Summer Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

రాష్ట్ర విద్యార్ధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండే ఎండల నుంచి ఉశమనం పొందడానికి కాస్త త్వరగానే ఈసారి వేసవి సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం ఒంటి పూట బడులు నడుస్తుండటంతో విద్యార్ధులు పాఠశాలలకు 8 గంటలకే చేరుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత 12.30 గంటలకు ఇళ్లకు..

Summer Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!
Telangana Schools Summer Holidays

Updated on: Apr 08, 2026 | 3:49 PM

ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భాణుడు భగభగలాడుతున్నాడు. ఫిబ్రవరి నెల ప్రారంభంలో విద్యార్థులు తీవ్రమైన వేసవి వేడి నుండి తప్పించుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఒంటి పూట బడులు ప్రకటించింది. ప్రస్తుతం ఒంటి పూట బడులు నడుస్తుండటంతో విద్యార్ధులు పాఠశాలలకు 8 గంటలకే చేరుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత 12.30 గంటలకు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ నెలాఖరుకు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. వేసవి సెలవుల గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో వేసవి సెలవులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే స్కూళ్లకు ఏప్రిల్‌ 23వ తేదీ చివరి పని దినంగా ఉండనుంది.

ఇప్పటికే ఇంటర్మీడియట్‌ పరీక్షలు పూర్తయ్యాయి. మూల్యాంకనం కూడా ముగియడంతో ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్నారు. ఇక పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు కూడా ఏప్రిల్ 16తో ముగియనున్నాయి. మరోవైపు బడుల్లోని ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్ధులకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నెల నాలుగో వారం నాటికి అన్ని పరీక్షలు పూర్తి చేసి విద్యార్ధులకు ప్రోగ్రెస్ కార్డులను కూడా అందించనున్నారు. చివరి పని దినం నాడు అంటే ఏప్రిల్ 23న పేరెంట్స్ మీటింగ్‌ నిర్వహించి ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్‌ 11వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది మొత్తం 48 రోజులపాటు విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇక 2026-27 విద్యా సంవత్సరం జూన్‌ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానుంది. ఈ మేరకు పెరుగుతున్న ఎండల వేడి కారణంగా ముందుగానే ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. వేసవి సెలవుల తేదీలు ఖరారు కావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు సొంత ఊళ్లకు పయనమయ్యేందుకు ట్రైన్‌, బస్సు టికెట్లను బుక్‌ చేసుకుంటున్నారు. సెలవుల కంటే ముందే సిలబస్ పూర్తి చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, అవసరమైతే వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించి విద్యా ప్రణాళికను సజావుగా పూర్తి చేయాలని ప్రభుత్వం పాఠశాల యాజమాన్యాలకు సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us