
తెలంగాణలో హయర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల క్యాలెండర్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల తేదీలతో కూడిన అధికారిక నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ మంగళవారం ప్రకటించారు. వచ్చే ఏడాది 2026 మే నెలలో వరుసగా ఎంట్రన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మేనేజ్‌మెంట్, లా వంటి ప్రధాన కోర్సుల పరీక్షలు అన్ని సమ్మర్ మే లో జరగనున్నాయి.
EAPCET కు సంబంధించి అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 4, 5 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికి మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షను జేఎన్‌టీయూ నిర్వహించనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకునే వారి కోసం మే 13, 14 తేదీల్లో ఐసెట్ నిర్వహించనున్నారు. బీఈడీ కోర్సులో ప్రవేశానికి మే 12న కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో TG EDCET పరీక్ష జరుగుతుంది.
లా కోర్సుల కోసం మే 18న ఉస్మానియా యూనివర్సిటీ TG LAWCET & PGLCET ప్రవేశ పరీక్షలను నిర్వహించనుంది. మే 15న TG ECET (లాటరల్ ఎంట్రీ), మే 28 నుంచి 31 వరకు TG PGECET, మే 31 నుంచి జూన్ 3 వరకు TG PECET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు జరగనున్నాయి.
ప్రస్తుతం కేవలం పరీక్షల తేదీలను మాత్రమే ప్రకటించిన ఉన్నత విద్యా మండలి, దరఖాస్తు ప్రక్రియ, ఫీజు వివరాలు, అర్హతలతో కూడిన పూర్తి స్థాయి నోటిఫికేషన్లను ఆయా సెట్ల కన్వీనర్లు త్వరలోనే విడుదల చేస్తారని స్పష్టం చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.