
హైదరాబాద్, మే 29: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్తు ఫేజ్ 1 ప్రక్రియ పూర్తయింది. దోస్తు ఫస్ట్ పేజ్ లో మొత్తం 89, 572 మంది విద్యార్థులు సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 60 వేల 436 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో డిగ్రీ దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిస్టారెడ్డి ఈ రోజు విడుదల చేశారు.
ఈసారి డిగ్రీలో కామర్స్ కోర్సు కు ఎక్కువ శాతం విద్యార్థులు ప్రియరిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కామర్స్ కోర్స్ కోసం 21 వేల 758 మంది విద్యార్థులు అప్లై చేసి సీట్లు దక్కించుకున్నారు. ఈసారి డిగ్రీ సీట్ల కోసం అప్లై చేసిన విద్యార్థులు 58,575 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం తీసుకున్నారు. 1552 మంది విద్యార్థులు తెలుగు మీడియంకి అప్లై చేసుకున్నారు. హిందీ మీడియం కోసం విద్యార్థులు ఎవరు దరఖాస్తు చేయకపోగా.. ఉర్దూ మీడియంను 309 మంది విద్యార్థులు తీసుకున్నారు. డిగ్రీ దోస్త్ మొదటి పేజ్ లో ఒక్క అడ్మిషన్ కూడా కాని కాలేజీలు మొత్తం 74 ఉన్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఇందులో 73 ప్రైవేట్ కాలేజీలు ఉండగా.. ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దోస్త్ ఫస్ట్ ఫేజ్ లో ఒక్క విద్యార్థి కూడా ప్రిఫర్ చేయలేదు.
ఇక శుక్రవారం నుంచి డిగ్రీ దోస్త్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 9 వరకు దోస్త్ సెకండ్ ఫేజ్ దరఖాస్తులు తీసుకోనున్నారు. జూన్ 13న సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపును ఉన్నత విద్యా మండలి చేయనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.