హైదరాబాద్, జనవరి 28: ఈ ఏడాది మార్చిలో నిర్వహించే పదోతరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపునకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. తత్కాల్ స్కీంలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రూ.1,000 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత గడువు పొడిగించే ప్రసక్తి లేదని పేర్కొ న్నారు. అంతేకాకుండా మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేవారు మాత్రమే.. ఆ తరువాత జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. కావున ఒకసారి ఫెయిలైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని కోరారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్ధులు చెల్లించిన ఫీజు మొత్తాన్ని ఫిబ్రవరి 6లోగా ట్రెజరీలో జమ చేయాలని ఆదేశించారు. అదేరోజు నామినల్ రోల్స్‌ను కూడా డీఈవో కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని శాఖల పరిధిలో దివ్యాంగుల కోటాలోని బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మార్చి 31 వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో బీఈడీ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ రామమోహన్‌రావు వివరించారు. కాగా గతేడాది జులై 14న బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఆరు నెలలు గడిచినా కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. దీంతో పలు కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 411 బీఈడీ కళాశాలలు ఉండగా.. వీటిల్లో 34 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.