దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులను భర్తీ చేయనున్నట్లు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రయి ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే దరఖాస్తుల స్వీకరణకు గడువు సెప్టెంబర్ 27వ తేదీతో ముగుస్తుందని నోటిఫికేషన్ విడుదల సమయంలో ఎస్‌బీఐ ప్రకటించింది.
అయితే తాజాగా ఈ గడువును మరికొంత కాలం పెంచింది ఎస్‌బీ. అభ్యర్థుల నుంచి మొత్తం అభ్యర్థనల మేరకు చివరి తేదీని పొడగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్‌బీఐ మొత్తం 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక దరఖాస్తులకు గడువును అక్టోబర్ 3వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీలోపు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరోసారి గడువు పెంచేది ఉండదని అధికారులు అభ్యర్థులకు తెలిపారు.
ఇదిలా ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదట నవంబర్ నెలలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ప్రీలిమినరీలో ఉత్తీర్ణులైన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. అనంతరం మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు. మెయిన్స్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. మెయిన్స్‌లో ఎంపికైన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ షార్ట్ లిస్ట్‌ను విడుదల చేశారు. ప్రీలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ అక్టోబర్ రెండో వారం నుంచి వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంటాయి.
ఎస్‌బీఐ పీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి ఏడాదిలో చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్వ్యూ సమయానికి డిగ్రీ పూర్తయి ఉండాలి. ఇక వయసు విషయానికొస్తే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయసులో సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 750 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..