
SBI announces Rs 90 crore worth scholarships for 23,230 students: దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్స్, వైద్య విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులతో పాటు ఓవర్సీస్ విద్యార్థుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ (SBI Foundation) ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌ల కోసం ప్రకటన వెలువరించింది. విద్యలో విశేష ప్రతిభను ప్రదర్శించే పేదింటి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా 2025-26 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా మొత్తం 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ స్కాలర్‌షిప్‌ల కోసం మొత్తం రూ.90 కోట్లు కేటాయించింది. 2022 నుంచి ఆశా స్కాలర్‌షిప్‌లను వెనుకబడిన విద్యార్థుల కోసం ఎస్‌బీఐ ఫౌండేషన్ అందిస్తుంది. ఈ మేరకు ఈ ఏడాదికి కూడా స్కాలర్‌షిప్ అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
ఎస్‌బీఐ ప్లాటినమ్ జూబ్లీ ‘ఆశా స్కాలర్‌షిప్’ 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ స్కాలర్‌షిప్‌కు 9వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదివే పేదింటి విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు 2024-25 విద్యా సంవత్సరంలో 75 శాతం మార్కులు లేదా 7 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 10 శాతం అంటే 67.5 శాతం మార్కులు లేదా సీజీపీఏ 6.30 సాధించాల్సి ఉంటుంది. ఇక విద్యార్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మించకుండా ఉండాలి. అర్హత కలిగిన విద్యార్థులు ఎవరైనా నవంబర్ 15, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులు తాము ఎంపిక చేసుకున్న కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేలు నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులు ఏటా రెన్యువల్ కావాలంటే.. చదివే కోర్సుల్లో కనీస అర్హత ప్రమాణాలు అంటే అటెండెన్స్, ఉత్తీర్ణత మార్కులు వంటివి పాటించాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ ప్లాటినమ్ జూబ్లీ ‘ఆశా స్కాలర్‌షిప్’ 2025 ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.