
హైదరాబాద్, నవంబర్ 26: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు రేపట్నుంచి (నవంబర్ 27) ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు ఇప్పటికే అడ్మిట్ కార్డులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ ఆన్‌లైన్ రాత పరీక్షలు నవంబర్ 27 నుంచి జనవరి 16 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు ఉచిత ఆన్‌లైన్ మాక్ టెస్టులను కూడా అభ్యర్ధుల వెసులుబాటు కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండా డైరెక్ట్ సైన్-ఇన్ అవడం ద్వారా వివిధ పేపర్ల మాక్ టెస్టులు రాసేందుకు వీలు కల్పించింది. ఈ మాక్ టెస్ట్‌ల ఆధారంగా ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్ష ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి సులభతరం అవుతుంది.
నిజానికి గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు నవంబర్ 17 నుంచి పరీక్షలు ప్రారంభంకావల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఇది వాయిదా పడింది. కాగా ఆర్‌ఆర్‌బీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్ డి లెవల్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. పరీక్షలు రాసే విద్యార్ధులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు, రెండు ఫొటోలు తమతో పాటు తీసుకెళ్లాలి. అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తమతోపాటు తీసుకెళ్లకూడదు. అమ్మాయిలు చేతులకు గోరింటాకు, ఆభరణాలు ధరించి వెళ్లకూడదు. ఈ మేరకు RRB అభ్యర్ధులకు సూచనలు చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 9513631887 హెల్ప్‌డెస్క్ నంబర్ ను సంప్రదించవచ్చని రైల్వే బోర్డుతన ప్రకటనలో తెలిపింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.