
పేరెంటింగ్ విషయంలో చాలామంది ఎన్నో అపోహలకు గురవుతుంటారు. వారు అడిగినదల్లా కొనివ్వడం, ఏ కష్టం రాకుండా చూసుకోవడమే ప్రేమగా భావిస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. పిల్లలకు మీరు చేసే అలవాట్లే వారి భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. వారిలో ఎప్పుడూ ఏదో కొత్తగా చేయాలనే ఉత్సాహం, మంచి అలవాట్లు, ఎమోషనల్ ఇంటెలిజన్స్ , కాన్ఫిడెన్స్ వంటి వాటికి చిన్నప్పుడే బీజం పడుతుంది. అందుకు మీ సహకారం వారికెంతో అవసరం.
పిల్లల ఆలోచనల్లో చిన్నప్పుడే మార్పు తేవాలి. పాజిటివ్ గుణాలను వారిలో పెంపొందించాలి. ఓటమి నుంచి నేర్చుకోవడం ఎలాగో చెప్పాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్ కోణంలో చూడటం నేర్పితే అది పెద్దయ్యాక వారికి అతిపెద్ద బలంగా మారుతుంది. వారు దేన్నైనా సాధించగలననే విశ్వాసం పెరుగుతుంది.
పిల్లలు ఆటలాడుకునేందుకు ఎంతో ఇష్టపడతారు. అయితే వారు ఆడే ఆటల్లో క్రియేటివిటీని పెంచేవి ఉండేలా ప్లాన్ చేయండి. అలాగే పిల్లల్లో ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేసే ఆటలను ప్రోత్సహించండి. కొన్ని ఆటలు వారి భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసేవి ఉంటాయి. వారి మెదళ్లకు పదును పెట్టే ఆటలు వారికెంతో తోడ్పడతాయి.
పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఎంతో నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను వివిధ రకాల ప్రశ్నలు వేస్తుంటారు. ఇది కొన్నిసార్లు మీకు చిరాకు అసహనం తెప్పించవచ్చు. కానీ వారికి మంచి నేర్పేందుకు ఇది కీలక సమయమని గుర్తించండి. వారి ఉత్సుకతను ప్రోత్సహించండి. అది వారిలో నేర్చుకోవాలనే తపపను పెంచుతుంది. ఇది వారి మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు కూడా తోడ్పడుతుంది.
పిల్లలు టీవీలు, ఫోన్ లకు అలవాటు పడిపోయి రీడింగ్ హ్యాబిట్ ను ఎప్పుడో మర్చిపోయారు. కానీ వారికి నచ్చే విధంగా ఉండే కథల పుస్తకాలను కొని గిఫ్ట్ గా ఇవ్వండి. వారితో ఆ స్టోరీలను గట్టిగా బయటకు చదవమని చెప్పండి. ఇది వారిలో చిన్నప్పటి నుంచి కొత్త విషయాలపై ఆసక్తి చూపేలా చేస్తుంది. ఇక బుక్స్ చదివే అలవాటున్న పిల్లలు చదువుల్లో కూడా ఓ అడుగు ముందే ఉంటారు.
పిల్లలు ఎక్కువ సేపు సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చుంటుంటారు. అది తీసుకుంటే మారాం చేస్తారు. కొన్ని సార్లు మరీ మొండికెత్తుకుని ఫోన్ చూస్తే గానీ తిననని మారాం చేస్తుంటారు. డిజిటల్ కంటెంట్ ను తగ్గించగలిగితేనే వారిలో సొంత తెలివితేటలు పెరుగుతాయని గుర్తించండి. లేదంటే వారు పెద్దయ్యాక ఏకాగ్రత లేకపోవడం, ఏ విషయాన్ని లోతుగా ఆలోచించలేకపోవడం, సరైన డెసిషన్ మేకింగ్ లేకపోవడం వంటి సమస్యలకు గురవుతుంటారు.