
మహిళా సాధికారత, లింగ న్యాయం లక్ష్యంగా అసోం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో భాగంగా బహుభార్యత్వం (పోలిగమీ) పాటించే పురుషులకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందకుండా చేయాలని ప్రతిపాదించింది. అలాగే ఈ ఆచరణలో ఉన్నట్లు తేలిన ప్రభుత్వ ఉద్యోగులను సేవల నుంచి తొలగించేలా అసోం సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్-1964లో సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం తన తొలి బడ్జెట్‌ను అసోం ఆర్థిక మంత్రి జయంత మల్ల బరువా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజంగా అర్హులైన వారికి చేరడంతో పాటు సమాజంలో సమగ్రత, నైతిక విలువలు, బాధ్యతాయుత పౌరసత్వం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇకపై ఏదైనా క్రిమినల్ చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తులకు కూడా ప్రభుత్వ నోటిఫై చేసిన సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిలిపివేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మహిళల హక్కులను కాపాడడం, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడం కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,85,084 కోట్లతో అసోం ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గత ఐదేళ్లలో ప్రారంభించిన ప్రధాన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని, వాటి కోసం రూ.6,000 కోట్లకు పైగా కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల కారణంగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయామని, ఆగస్టు నుంచి సంక్షేమ పథకాలు తిరిగి అమల్లోకి వస్తాయని మంత్రి చెప్పారు.
అలాగే చిన్న టీ తోటల యజమానులకు పన్ను మినహాయింపు పరిమితిని నాలుగు రెట్లు పెంచాలని, పైప్‌లైన్ ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్‌జీ)పై వ్యాట్‌ను దాదాపు 10 శాతం తగ్గించాలని ప్రతిపాదించారు. అన్ని సంక్షేమ పథకాల అమలును డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ డీబీటీ స్కీమ్స్ (DIDS) ద్వారా ఆధార్ ఆధారిత ధృవీకరణతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్యల ద్వారా సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరగడంతో పాటు మహిళా సాధికారత, సామాజిక బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అసోం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.