
హైదరాబాద్, జులై 6: డిగ్రీ ప్రవేశాల సీజన్ నేపథ్యంలో అనుమతి లేని, గుర్తింపు లేని కాలేజీల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ ఉందంటూ తప్పుడు ప్రచారాలతో అడ్మిషన్లు చేపడుతున్న కొన్ని కాలేజీలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులు అధికారిక డీఓఎస్‌టీ (DOST) పోర్టల్‌లో నమోదైన గుర్తింపు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని, మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: చిన్నప్పుడు పొట్టపగిలేలా నవ్వుకున్న ‘రెక్కల ఏనుగు’ గుర్తుందా..? 90’s కిడ్స్‌కి ఇష్టమైన కథ
డిగ్రీ కోర్సులో చేరదలచుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి. ఉన్నత విద్యాశాఖవారు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) లేకపోయినా, ఉన్నట్టుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్న విద్యాసంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి, తప్పుడు ప్రకటనలతో అనధికారికంగా అడ్మిషన్లు జరుపుతున్న కాలేజీలపై హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొన్ని డిగ్రీ కాలేజీలు తమకు ఉస్మానియా అఫిలియేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న విషయాన్ని ఉన్నత విద్యాశాఖ అధికారులు మా దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మేము జరిపిన విచారణలో.. ఆ కాలేజీలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి గుర్తింపు లేదో అనుమతి లభించలేదని స్పష్టమైంది. తప్పుడు వాగ్దానాలతో విద్యార్థులను ఆకర్షించేందుకు ఈ కాలేజీలు మోసపూరిత ప్రకటనలకు తెరలేపాయి.
Also Read: A, B, Cల్లో దొంగ వెళ్లిన దారేది? మీ తెలివికి సవాల్ విసిరే చిక్కుప్రశ్న
ఇలాంటి తప్పుడు ప్రకటనలను నమ్మి మీ అమూల్యమైన విద్యా సంవత్సరాన్ని, కష్టపడి చేసిన డబ్బును నష్టపోవద్దు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ‘దోస్త్’ (DOST) వెబ్‌సైట్‌లో నమోదై, అందులో చూపిస్తున్న గుర్తింపు పొందిన కాలేజీలనే ప్రవేశాలు పొందాలి. తప్పుడు ప్రకటనలతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కాలేజీల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి కాని లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. విద్యా ప్రవేశాల విషయంలో ఎలాంటి మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటన వెలువరించారు.