Indian Navy Jobs: అగ్నిపథ్‌కు పోటెత్తిన దరఖాస్తులు…నేవీలో చేరేందుకు అమ్మాయిల ఆసక్తి.. ఎంత మంది అప్లై చేశారంటే?

Agnipath Scheme - Indian Navy Jobs: అగ్నిపథ్ పథకం కింద భారత నేవీ 3వేల ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. వీటి కోసం దాదాపు 9.55 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 82వేల మంది అమ్మాయిలు ఉన్నారు.

Indian Navy Jobs: అగ్నిపథ్‌కు పోటెత్తిన దరఖాస్తులు...నేవీలో చేరేందుకు అమ్మాయిల ఆసక్తి.. ఎంత మంది అప్లై చేశారంటే?
Indian Navy

Updated on: Aug 04, 2022 | 10:41 AM

Indian Navy Jobs: సైన్యంలో నియామకాల కోసం కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో చేరేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా నావికాదళంలో చేరేందుకు ముందుకొస్తున్నారు. అగ్నిపథ్ పథకం కింద నేవీలో సీనియర్ సెకండరీ రిక్రూట్, మెట్రిక్ రిక్రూట్ నియమాకాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. అగ్నివీర్ పథకం కింద నేవీ 3వేల ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఈ ఉద్యోగాలకు మొత్తం 9.55 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకోగా.. వీరిలో 82 వేల మంది అమ్మాయిలున్నారని భారత నావికా దళం అధికారికంగా ప్రకటించింది. నేవీలోని అన్ని విభాగాల్లో లింగ తటస్థతను పాటించేలా అగ్నిపథ్ పథకంలో మహిళా నావికులను నియమించాలని భారత నావికాదళం జూన్ 20వ తేదీన నిర్ణయం తీసుకుంది.

ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీలో మహిళా అధికారులు ఉండగా… ఆఫీసర్స్ ర్యాంక్ కంటే తక్కువ స్థాయిలో మహిళలకు ఇప్పటివరకు అవకాశం కల్పించలేదు. దీంతో అగ్నిపథ్ కింద ఆఫీసర్ల స్థాయి కంటే దిగువ క్యాడర్ సిబ్బందిని భారత త్రివిధ దళాల్లో చేర్చుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకంలో ఎంపికైన వారిని అగ్నివీర్ లుగా పరిగణిస్తారు. వీరికి నాలుగేళ్ల పాటు శిక్షణ ఇచ్చి…వీరిలో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. వంద మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేసి.. 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పనిచేసే అవకాశం కల్పిస్తారు.

అగ్నిపథ్ పథకంలో కేవలం నాలుగేళ్ల సర్వీసుతో పాటు మంచి జీతం వచ్చే అవకాశం ఉండటంతో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సైన్యంలో చేరేందుకు పోటీపడుతున్నారు. ఇప్పటివరకు సైన్యంలో పనిచేయాలని ఎంతో మంది అమ్మాయిలు అనుకున్నప్పటికి…ఆ కల నెరవేరలేదు. అగ్నిపథ్ ద్వారా కేంద్రప్రభుత్వం అమ్మాయిలకు అవకాశం కల్పించడంతో తాము సైన్యంలో చేరి అగ్నివీర్ అయిపోదామని ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. అగ్నిపథ్ యోజనకు ఎంపికైన మొదటి బ్యాచ్ అగ్నివీర్ లకు ఈఏడాది నవంబర్ లో శిక్షణ ప్రారంభంకానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎడ్యుకేషన్, కెరీర్ వార్తలు చదవండి