UGC NET 2026 పరీక్ష రద్దు ఎఫెక్ట్.. NTAలో ఏకంగా 50 మందికిపైగా ఉద్యోగులపై వేటు!

UGC-NET పరీక్షల్లో చోటుచేసుకున్న లోపాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక చర్యలకు దిగింది. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించడంతో పాటు పరీక్షల నిర్వహణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. సైబర్ సెక్యూరిటీ, టెస్ట్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్ వంటి విభాగాల్లో కొత్త నిపుణులను నియమించనున్నారు..

UGC NET 2026 పరీక్ష రద్దు ఎఫెక్ట్.. NTAలో ఏకంగా 50 మందికిపైగా ఉద్యోగులపై వేటు!
NTA sacks 50 after UGC-NET errors

Updated on: Aug 18, 2026 | 6:55 AM

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 18: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళన చేపట్టారు. సోమవారం 50 మందికి పైగా సిబ్బందిని తొలగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన విద్యాశాఖ ఉన్నతాధికారులు, NTA అధికారులతో కీలక సమావేశం జరిగిన వెంటనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల UGC-NET పరీక్షల్లో చోటుచేసుకున్న పలు లోపాల నేపథ్యంలో NTAపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 22 నుంచి 30 వరకు నిర్వహించిన UGC-NET పరీక్షల్లో మూడు సబ్జెక్టులకు సంబంధించి సమస్యలు తలెత్తడంతో వాటికి రీ-టెస్ట్ నిర్వహించాలని NTA ఆదేశించింది. ఈ పరీక్ష ద్వారా దేశంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతలను నిర్ణయిస్తారు. ఇక అంతకుముందు NEET-UG 2026 పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారం నేపథ్యంలో గత నెలలోనే NTAలో 47 మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థుల ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉధృతం కావడంతో కేంద్ర విద్యాశాఖపైనా ఒత్తిడి పెరిగింది.

తాజా సమావేశంలో NTA చేపట్టిన సంస్కరణ చర్యలను మంత్రి ప్రహ్లాద్ జోషికి అధికారులు వివరించారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను సమూలంగా సంస్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటికే 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు విద్యాశాఖ తెలిపింది. అదే సమయంలో NTAలో 10 కొత్త ప్రొఫెషనల్ నాయకత్వ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటనలు జారీ చేశారు. వీటిలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO), చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (CFO), చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (CISO), జనరల్ మేనేజర్ (టెస్ట్ సెక్యూరిటీ), జనరల్ మేనేజర్ (రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, సైకోమెట్రిక్స్) వంటి కీలక పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన తదితర ప్రత్యేక విభాగాల్లో ప్రైవేట్ రంగానికి చెందిన డొమైన్ నిపుణులను కూడా NTAలోకి తీసుకురానున్నారు.

పరీక్షల నిర్వహణలో ఉన్న ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరీక్షలకు సంబంధించిన అత్యంత గోప్యమైన కార్యకలాపాల నిర్వహణ వ్యవస్థను (CONOPS) పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. సురక్షిత గదులు, ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ పరికరాల డిపాజిట్ విధానాలను కూడా అత్యంత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, లోపాలను సరిదిద్దేందుకు తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను సమర్పించాలని NTAను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. వరుసగా పరీక్షల నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్ ఆరోపణలు, రీ-టెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో NTAలో చేపట్టిన ఈ ప్రక్షాళనకు ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్తులో పోటీ పరీక్షలు మరింత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఈ సంస్కరణలు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us