హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ విద్యుత్ శాఖలో త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు ఉద్యోగ ప్రకటన ఇవ్వనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఓ ప్రకటనలో వెల్లడించారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తామని అన్నారు. తాజాగా ఆయన ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ..త్వరలోనే విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ఇటీవల వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకొనేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వరదల సమయంలో శ్రమించిన విద్యుత్ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక విద్యార్ధుల ఫీజు రీయంబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేస్తామని, దసరా కంటే ముందుగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDMCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నింటినీ ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం పోస్టుల్లో.. మేనేజర్ (మైనింగ్) పోస్టులు 6, మేనేజర్ (ఐటీ) పోస్టులు 1, మేనేజర్ (లీగల్) పోస్టులు 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 21, 2024వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు బెరైటీస్ ప్రాజెక్ట్ (మంగంపేట), ఏపీడీఎంసీఎల్ ప్రధాన కార్యాలయం (విజయవాడ)లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఏపీడీఎంసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవచ్చు.
APDMCL ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.