
హైదరాబాద్, జూన్ 1: జూన్ 21న జరగనున్న నీట్-యుజి పునఃపరీక్ష పెన్ అండ్ పేపర్ (OMR) విధానంలోనే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా మార్చడం ఆచరణాత్మకంగా అసాధ్యమని స్పష్టం చేసింది. సమయాభావం ఎన్‌టీఏ (NTA) పై ఉన్న భారీ ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్‌జేడీ (RJD) ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. భవిష్యత్తులో నీట్ పరీక్షల సంస్కరణలు, ఆన్‌లైన్ (CBT) విధానం అమలు వంటి అంశాలపై జూలైలో విచారణ జరపనుంది.
పిటిషనర్ సుధాకర్ సింగ్ తన పిటిషన్‌లో ఎన్‌క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్లు, ఏఐ (AI) నిఘా వ్యవస్థ, ఎన్‌టీఏ స్థానంలో కొత్త అథారిటీ ఏర్పాటు వంటి ముఖ్యమైన సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై జూలైలో విచారణ జరగనుంది. మే 3 న జరిగిన నీట్ యుజి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంతో మరోసారి పరీక్షను నిర్వహిస్తుంది NTA . ఈ నేపథ్యంలో పరీక్ష విధానం మార్పు కోసం పిటిషన్ దాఖలైంది. జూన్ 21న రీ-పరీక్ష సాఫీగా పెన్ అండ్ పేపర్ మోడ్‌లోనే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను విద్యార్థులు, తల్లిదండ్రులు స్వాగతించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.