NEET UG 2026 Re-Exam Date: నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

పేపర్‌ లీక్ కారణంగా నీట్‌ ఎగ్జాం రద్దు చేయడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్ధుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ చర్య విద్యార్ధులతోపాటు వారి తల్లిదండ్రులకు దేశ వ్యాప్తంగా ఆగ్రహం కలిగించింది. ఈ క్రమంలో నీట్‌ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) షెడ్యూల్‌ విడుదల చేసింది..

NEET UG 2026 Re-Exam Date: నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
NEET UG re exam date announced

Updated on: May 15, 2026 | 2:41 PM

హైదరాబాద్‌, మే 15: నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు ఎన్టీయే కొత్త పరీక్ష తేదీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్‌ 21 (ఆదివారం) నీట్ యూజీ 2027 పరీక్ష మరోమారు జరగనున్నట్లు ఎన్టీయే శుక్రవారం (మే 15) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఎన్‌టీఏ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్‌టీఏ (NTA) కోరింది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు జూన్ 14న జారీ చేస్తారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా న్యూఢిల్లీలో కొత్త పరీక్ష తేదీ, నిర్వహణ విధానంపై మీడియాకు వివరించారు.

కాగా దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 3వ తేదీన నీట్‌ యూజీని (నీట్‌-యూజీ 2026) పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించింది. అయితే నీట్‌ పరీక్షకు రెండు రోజుల ముందు అంటే మే 1వ తేదీన ఈ పరీక్షకు సంబంధించిన 120 ప్రశ్నలు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో లీకయ్యాయి. దీంతో నీట్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్టీయే కొత్త పరీక్ష తేదీని ఈ రోజు ప్రకటించింది. రీఎగ్జామినేషన్‌కు మరోసారి దరఖాస్తు చేసుకోనక్కర్లేదని, ఇప్పటికే చెల్లించిన ఫీజు కూడా రిఫండ్‌ చేస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. మరోవైపు నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం సీబీఐని రంగంలోకి దింపింది. సీబీఐ దీనిపై కేసు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుంది.

రాజస్థాన్‌లోని సికార్‌లో తొలుత ఈ లీకేజీ బయటపడింది. 410 ప్రశ్నలతో ఉన్న ఓ గెస్‌ పేపర్‌ పరీక్షకు ముందే మే 1 విద్యార్థులకు అందింది. ఇందులో మొత్తం 120 కెమిస్ట్రీ, జువాలజీ ప్రశ్నలు నేరుగా నీట్‌ పపర్‌లో ఇచ్చిన ప్రశ్నలకు అచ్చుగుద్దినట్లు ఉన్నాయి. ప్రశ్నల క్రమంతో పాటు ఆప్షన్లు కూడా ఒకే వరుసలో ఉండటంతో లీక్‌ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే మహారాష్ట్రలోని నాసిక్ నుంచి నీట్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచే రాజస్థాన్‌, హరియాణా, జమ్మూకశ్మీర్‌, కేరళతోపాటు పలు రాష్ట్రాలకు అందినట్లు దర్యాప్తులో తేలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us