NEET UG 2026 రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదల.. జూన్ 21న పరీక్ష

NEET UG 2026 Re-Exam Admit Card: జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జాంకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షల ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

NEET UG 2026 రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదల.. జూన్ 21న పరీక్ష
NEET UG Re-Exam Admit Cards

Updated on: Jun 15, 2026 | 6:13 AM

హైదరాబాద్‌, జూన్‌ 15: నీట్ యూజీ (NEET UG) 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం NEET UG 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21, 2026న నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఉన్న వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రం, రోల్ నంబర్, పరీక్ష సమయం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్‌లో పేరు, ఫోటో, రోల్ నంబర్,పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. అలాగే neetug2026@nta.ac.in కు ఈమెయిల్ ద్వారా కూడా సమస్యలను తెలియజేయవచ్చు.

నీట్ యూజీ 2026 రీఎగ్జాం అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే ముందు, ఫీజు రీఫండ్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో అభ్యర్థులు ధృవీకరించుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. అవసరమైతే వెంటనే సవరణలు చేసుకోవాలని పేర్కొంది. పరీక్షా రోజు అభ్యర్థులు అడ్మిట్ కార్డు ప్రింట్‌ను తప్పనిసరిగా తమతో తీసుకెళ్లాలి. అలాగే చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి. పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలి. అడ్మిట్ కార్డులో, ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో పేర్కొన్న అన్ని సూచనలను కచ్చితంగా పాటించాలి. నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకురాకూడదు. అభ్యర్థులు పరీక్షకు ముందు అధికారిక సూచనలను పూర్తిగా చదివి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

ఇక నీట్ యూజీ 2026 రీ టెస్ట్‌ ఆదివారం (జూన్ 21) మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు ఆఫ్‌లైన్ పెన్-పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం నీట్ యూజీకి దాదాపు 22.75 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, మే 3న జరిగిన పరీక్షకు 22.05 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ నిష్పక్షపాతాన్ని, పారదర్శకతను నిర్ధారించడానికి జూన్ 21న జరిగే రీ ఎగ్జాంకు పటిష్టమైన పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తున్నారు. అలాగే ఈసారి నీట్‌ పరీక్షా సమయాన్ని 15 నిమిషాలు పొడిగించిన విషయం తెలిసిందే. మొత్తం పరీక్షా సమయాన్ని ఇప్పుడు 195 నిమిషాలకు పెంచారు. దీనివల్ల అభ్యర్థులకు అదనపు సమయం లభిస్తుంది. రఫ్‌ వర్క్‌ పేపర్లకు కూడా అదనంగా ఇవ్వనుంది. నీట్ పరీక్షలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం నుండి 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్‌కు గరిష్టంగా 720 మార్కులు ఉంటాయి. ఇందులో ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు.

నీట్ యూజీ 2026 రీఎగ్జాం అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ పెన్నులు, పర్సులు, బ్యాగులు, స్టడీ మెటీరియల్, రాతపూర్వక నోట్స్, ఇతర ఏ విధమైన స్టేషనరీని తీసుకురాకూడదు. ఏ రూపంలోనైనా ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లేదా కమ్యూనికేషన్ పరికరం ఖచ్చితంగా నిషేధించబడింది. పరీక్షా కేంద్రం లోపలికి ట్రాన్పరెంట్‌ వాటర్‌ బాటిళ్లను మాత్రమే అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద విలువైన వస్తువులను భద్రపరిచే సౌకర్యాలను అందించే అవకాశం లేదు కాబట్టి, విద్యార్థులు వాటిని వెంట తీసుకురావద్దని సూచించడమైనది. చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి, అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులలో పేర్కొన్న దుస్తుల నియమావళి, రిపోర్టింగ్ సూచనలను పాటించాలని సూచించారు. 2027 నుంచి నీట్‌ సీబీటీ విధానంలో జరగనుంది.

Follow Us