
హైదరాబాద్, మే 11: నీట్ పరీక్షలోని మొత్తం 720 ప్రశ్నకు గానూ బయటకు వచ్చిన ఈ 140 ప్రశ్నలకే ఏకంగా 600 మార్కులు కేటాయించారు. పైగా ఈ ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అసలు పేపర్‌తో సరిపోలిందని దర్యాప్తు అధికారులు తేల్చడంతో వివాదం మరింత ముదిరింది. గెస్ పేపర్ మాదిరి తయారు చేసిన ఈ మెటీరియల్ మే 1వ తేదీన రాజస్థాన్‌లోని సికార్‌లో చక్కర్లు కొట్టింది. దీనిని విద్యార్ధులు రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష రోజు రాత్రినాటికి ఒక్కో కాపీ రూ.30 వేలకు అమ్ముడైందని పేర్కొన్నారు. ఈ మెటీరియల్ పేపర్ లీక్‌లో భాగమా లేదా ప్రాక్టీస్ కోసం ఇచ్చిన మాదిరి ప్రశ్నలా అనేది దర్యాప్తులో తేల్చుతామని అధికారులు తెలిపారు. ఆ మెటీరియల్ కోచింగ్ తరహా టెస్ట్ సిరీస్‌ను పోలి ఉందని అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఒక పెద్ద ఆర్గనైజ్‌డ్ నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని అన్నారు. దర్యాప్తులో భాగంగా రాజస్థాన్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని పలు నగరాల్లో సోదాలు, విచారణలు జరుపుతున్నట్లు తెలిపారు.
మే 1న కేరళకు చెందిన ఓ విద్యార్ధి సికార్‌లో కొనుగోలు చేయగా.. ఇది గంటల వ్యవధిలోనే కేరళలోని పలు కోచింగ్ నెట్‌వర్క్‌లకు, పీజీలకు, కెరీర్ కౌన్సెలర్లు, నీట్ అభ్యర్ధులకు పంపిణీ అయ్యింది. పరీక్ష తర్వాత ఓ పీజీ ఆపరేటర్ పోలీసుకు, NTAకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పేపర్ లీక్ చేశారన్న అనుమానంతో ఇప్పటి వరకు పోలీసులు 13 మందిని సికార్, డెహ్రాడూన్‌లలో అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది మే 3, 2026వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే షిఫ్టులో భారత్‌తోపాటు విదేశాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్ధులు నీట్ యూజీ 2026 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో సుమారు 13.32 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉండగా, దాదాపు 9.46 లక్షల మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. మే 3న నీట్-యూజీ 2026 పరీక్షకి కొన్ని రోజుల ముందే క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నీట్ పరీక్షకు పేపర్ లీక్‌లు జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు తీవ్ర స్థాయిలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. తాజా వివాదంపై ఈ వివాదంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నీట్ పరీక్షను పూర్తి భద్రతా ప్రోటోకాల్ కింద నిర్వహించామని, ప్రస్తుతం వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని తన ప్రకటనలో పేర్కొంది.
మే 3న జరిగిన నీట్ పరీక్షను షెడ్యూల్ ప్రకారం పూర్తి భద్రతా ప్రోటోకాల్ నడుమ నిర్వహించామని NTA తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. క్వశ్చన్ పేపర్‌కు వాటర్‌మార్క్ గుర్తింపు చిహ్నాలు ఇచ్చామని, GPS కలిగిన వాహనాలలో నీట్ క్వశ్చన్ పేపర్‌లను రవాణా చేశామని తెలిపింది. పరీక్షా కేంద్రాల్లో AI-సహాయక CCTV పర్యవేక్షించినట్లు తెలిపింది. అన్ని కేంద్రాలలో ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ ధృవీకరణ నుంచి 5G జామ్మర్ల వరకు పకడ్భందీగా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని NTA పేర్కొంది. ఆ రోజు పరీక్షా ప్రక్రియ ప్రణాళిక ప్రకారం జరిగిందని ఏజెన్సీ నొక్కి చెప్పింది.
The National Testing Agency is aware of reports concerning the action initiated by the Rajasthan Special Operations Group in connection with alleged irregularities around NEET (UG) 2026. The following is placed on record for the information of candidates, parents, and the public.…
— National Testing Agency (@NTA_Exams) May 10, 2026
NTA ప్రకారం, పరీక్ష ముగిసిన నాలుగు రోజుల తర్వాత అంటే మే 7వ తేదీ రాత్రి మాత్రమే లీకేజీలకు సంబంధిచిన సమాచారం ఏజెన్సీకి అందినట్లు తెలిపింది. ధృవీకరణతోపాటు అవసరమైన చర్యల కోసం మే 8వ తేదీ ఉదయం ఈ విషయాన్ని వెంటనే కేంద్ర ఏజెన్సీలకు నివేదించినట్లు అది పేర్కొంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌టీఏ తెలిపింది. ఈ విషయం ఇంకా దర్యాప్తులో ఉందని, ఏజెన్సీలు వాస్తవాలను నిర్ధారిస్తాయని టెస్టింగ్ ఏజెన్సీ వివరించింది.
కాగా 2024లోనూ నీట్ యూజీ పరీక్షకు సంబంధించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి. అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిరసనలు, కోర్టు కేసుల నడుమ సీబీఐ దర్యాప్తు చేపట్టింది. NTA అసమర్ధతను దుయ్యబట్టారు. అయితే మొత్తం పరీక్షను రద్దు చేసేంత పెద్ద వ్యవస్థాగత ఉల్లంఘన జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ వ్యవహారం సర్ధుమనిగింది. కానీ నేషనల్ టెస్టింగ ఏజెన్సీ (NTA) నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై నమ్మకం మాత్రం సన్నగిల్లింది. ఇక ఈ ఏడాది కూడా బహుళ-దశల బయోమెట్రిక్ ధృవీకరణ, AI-సహాయక CCTV నిఘా, ప్రశ్నపత్రాల GPS ట్రాకింగ్, కేంద్రాలలో 5G సిగ్నల్ జామ్మర్లు, కేంద్ర పర్యవేక్షణ వ్యవస్థలతో సహా అనేక అదనపు భద్రతా చర్యలు చేపట్టినా లీకేజీను అడ్డుకోలేకపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.