నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్- యూజీ 2023) పరీక్ష దరఖాస్తుల గడువు ఏప్రిల్ 6తో ముగిసిన విషయం తెలిసిందే. ఐతే చివరి నిముషంలో దరఖాస్తు చేయలేకపోయామంటూ కొందరు విద్యార్థులు చేసిన విజ్ఞప్తుల మేరకు ఎన్‌టీఏ మరో అవకాశం ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ రాత్రి 11.30గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. నీట్ యూజీ పరీక్షకు గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి మంగళవారం నుంచి అధికారిక వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ల ట్యాబ్‌ను మళ్లీ అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా13వ తేదీ అర్ధరాత్రి 11.59గంటల వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే అప్లై చేసుకున్న విద్యార్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరణకు ఎన్‌టీఏ కరెక్షన్ విండోను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
కాగా మే 7వ తేదీన (ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు దేశ వ్యాప్తంగా 499 నగరాల్లో నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భారతీయ భాషల్లో ఆఫ్‌లైన్ విధానంలో (పెన్ను, పేపర్ విధానంలో) ఈ పరీక్షను నిర్వహిస్తారు. నీట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది 17.64లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాయగా.. ఈ ఏడాది 18 లక్షల మంది రాసే అవకాశం ఉందని అధికారలు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.