తెలంగాణ రాష్ట్రంలోని వైద్య, దంత కళాశాలల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి డాక్టర్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళ వారం నోటిఫికేషన్ జారీచేసింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్- 2021లో అర్హత సాధించిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ వెల్లడించింది. నేటి (జనవరి 5) నుంచి 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నిర్ధేశిత ప్రమాణాల మేరకు దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలంది.
మెరిట్ ఆధారంగా..
కాగా ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం మెరిట్ ప్రకారం అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనుంది. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్ల కోసం యూనివర్సిటీ ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అందులో అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో తమ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా మెడికల్ ప్రవేశాలకు సంబంధించిన అర్హతలు, ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ను పరిశీలించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read:
Civil Mains Exam: ఒమిక్రాన్ టెన్షన్.. సివిల్ మెయిన్స్ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ కీలక ప్రకటన..
AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫైనల్ ఎగ్జామ్స్‌లో 11 పేపర్లకు బదులు..