IT Jobs: ఆర్థిక మాంద్యం అనే బెంగే వద్దు.. వచ్చే ఏడాదిలో మూడు లక్షల ఉద్యోగాలు.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు..

|

Aug 02, 2022 | 3:23 PM

IT Jobs: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ముంచుకొస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి...

IT Jobs: ఆర్థిక మాంద్యం అనే బెంగే వద్దు.. వచ్చే ఏడాదిలో మూడు లక్షల ఉద్యోగాలు.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు..
Follow us on

IT Jobs: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ముంచుకొస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీంతో అమెరికా మాంద్యం దిశగా వెళుతోందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ‘అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుంది’ అన్న నానుడి ఉన్న విషయం తెలిసిందే. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే దాని ప్రభావం ప్రపంచంపై కచ్చితంగా ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఈ కారణంగా ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు కోల్పోనున్నారన్న వార్తలు వస్తున్న తరుణంలో డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ రిపోర్ట్‌ ఊరటనిస్తోంది. రానున్న రోజుల్లో ఐటీ, బీపీఎం రంగాల్లో భారీగా ఉద్యోగాలు రానున్నయని తెలిపింది.

2023లో 7 శాతం వృద్ధి నమోదుతో దేశంలో మూడు లక్షలకుపైగా ఉద్యోగాలు రానున్నట్లు అంచనా వేసింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో భారతదేశంలో ఐటీ ఉద్యోగుల 50 లక్షల నుంచి కోటికి చేరుకోనుందని నివేదికలో తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం ఐటీ, బీపీఎం పరిశ్రమల వృద్ధి కొనసాగుతోందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. దేశ జీడీపీకి ఈ రంగం 8 శాతానికి పైగా తోడ్పడుతుందని టీమ్‌ లీజ్‌ సంస్థ వెల్లడించింది. పెట్టుబడుల పెరుగుదలతో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 21 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఇక వచ్చే ఏడాదిలో టాప్‌ 10 ఐటీ కంపెనీలు డిజిటల్‌ నైపుణ్యాలున్న అభ్యర్థుల కోసం చూస్తున్నాయని తెలిపింది.

ఈ విషయమై టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈవో సునీల్‌ మాట్లాడుతూ..’కంపెనీలు డిజిటల్‌ నైపుణ్యాలకు సంబంధించి చిన్న నగరాల అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. ఉద్యోగాలను వెతుక్కోవడానికి ఐటీ మేధావులు నగరాలకు వెళ్లాల్సిన రోజులు పోయాయి. వర్క్‌ఫ్రం హోం విధానం, డిజిటల్ నైపుణ్యాలున్న వారు మెట్రోయేతర నగరాల్లో లభిస్తున్న నేపథ్యంలో కంపెనీలే అభ్యర్థుల వద్దకు వెళుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..