Employees: భారతదేశంలో వచ్చే ఏడాది నుంచి వేతనాలు పెరుగుతాయని అందరు భావిస్తున్నారు.
2022లో ఉద్యోగుల జీతం సగటున 9.3 శాతం పెరుగుతుందని ఒక నివేదికలో వెల్లడైంది. 2021లో ఇది 8 శాతంగా ఉందని ఒక అంచనా. 2022లో పలు కంపెనీల ముందు ఉన్న ప్రధాన లక్ష్యం ఉద్యోగులను ఆకర్షించడం, నిలుపుకోవడమే అని తేలింది. ఈ పరిస్థితిలో కంపెనీలు ఉద్యోగులకు మరింత ఇంక్రిమెంట్ ఇస్తాయని పలువురు ఉద్యోగులు అంచనా వేస్తున్నారు.
వచ్చే ఏడాది ఆసియా-పసిఫిక్‌లో అత్యధిక జీతాల పెరుగుదల నమోదవుతుందని పేర్కొంది. వచ్చే 12 నెలల్లో వ్యాపార దృక్పథం మెరుగుపడుతుందని అందరు భావిస్తున్నారు. 2021 మే, జూన్‌లో ఆసియా-పసిఫిక్‌లో 1,405 కంపెనీల మధ్య ఈ సర్వే నిర్వహించారు. వీటిలో 435 కంపెనీలు భారతదేశానికి చెందినవి. ఈ నివేదిక ప్రకారం.. 52 శాతం భారతీయ కంపెనీలు రాబోయే 12 నెలల్లో తమ ఆదాయ దృక్పథం సానుకూలంగా ఉంటుందని నమ్ముతున్నాయి. వ్యాపార దృష్ట్యా ఉద్యోగాల పరిస్థితి కూడా మెరుగవుతుందన్నారు. వచ్చే ఏడాదిలో 30 శాతం కంపెనీలు కొత్త నియామకాలకు సిద్ధమవుతున్నాయని నివేదికలో తేల్చారు.
ఇంజనీరింగ్ (57.5 శాతం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (53.3 శాతం), సాంకేతిక నైపుణ్యాలు (34.2 శాతం), అమ్మకాలు (37 శాతం), ఫైనాన్స్ (11.6 శాతం) వంటి వివిధ రంగాలలో గరిష్ట నియామకాలు ఉంటాయని తేల్చింది. ఈ కంపెనీలు ఉద్యోగులకు అధిక జీతం అందిస్తాయని చెప్పింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉద్యోగ నష్టం రేటు కూడా తక్కువగా ఉందని అంచనా వేసింది. ఇంతకుముందు డెలాయిట్ తన సర్వేలో 2022 లో సగటు వేతన వృద్ధి 8.6 శాతానికి పెరుగుతుందని ప్రకటించింది. సర్వేలో పాల్గొన్న దాదాపు 25 శాతం కంపెనీలు 2022 నాటికి రెండంకెల వేతన వృద్ధిని నమోదు చేస్తాయని తెలిపింది.