JoSAA 2022 Counselling date: జోసా 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఐఐటీ బాంబే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి సెప్టెంబరు 12 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA 2022) కౌన్సెలింగ్ మొదలుకానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆగస్టు 28న నిర్వహిస్తామని, ఫలితాలను సెప్టెంబరు 11న వెల్లడిస్తామని ఇటీవల ఐఐటీ బొంబాయి వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ మరునాడు… అంటే సెప్టెంబరు 12న జోసా కౌన్సెలింగ్ మొదలవుతుందని ప్రకటించింది. అక్టోబరు 12తో కౌన్సెలింగ్ ముగుస్తుంది.
ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) జారీచేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం బీటెక్ విద్యాసంవత్సరం అక్టోబరు 10 నుంచి మొదలవుతుంది. తరగతులు మాత్రం ఆ నెల 25లోపు ప్రారంభం కావాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌పై అయోమయం నెలకొంది. జోసా కంటే ముందుగా ఎంసెట్ కౌన్సెలింగ్ జరిపితే తర్వాత విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు వచ్చాయని వెళ్లిపోతారు. దాంతో ప్రముఖ కళాశాలల్లో సీట్లు ఖాళీ అవుతాయి. అందుకే జోసా కంటే ముందుగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభించినా జోసా చివరి రౌండ్ తర్వాత ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ జరపాలని ఉన్నత విద్యామండలి వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: