AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దె కట్టలేదనీ 90 ఏళ్ల వృద్ధున్ని బయటకు గెంటేస్తుండగా పెట్టెలో నుంచి బయటపడ్డ ఫొటో.. దెబ్బకు రంగంలోకి ప్రధాని!

దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి.. కేంద్ర మంత్రిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకుడు.. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని దేశం కోసం పోరాడిన సమరయోధుడు. అలాంటి వ్యక్తి జీవిత చరమాంకంలో సాధారణ వ్యక్తిలా అద్దె ఇంట్లో పేదరికాన్ని అనుభవించారనే కథనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనే గుల్జారీలాల్ నందా. రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టినా, వ్యక్తిగత జీవితంలో నిరాడంబరతకు, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు..

అద్దె కట్టలేదనీ 90 ఏళ్ల వృద్ధున్ని బయటకు గెంటేస్తుండగా పెట్టెలో నుంచి బయటపడ్డ ఫొటో.. దెబ్బకు రంగంలోకి ప్రధాని!
Former Prime Minister Gulzarilal Nandas Inspiring Story
Srilakshmi C
|

Updated on: Nov 01, 2026 | 11:18 AM

Share

గుల్జారీలాల్ నందా 1898 జూలై 4న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవారు. ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం అధ్యాపకుడిగా పనిచేశారు. మహాత్మా గాంధీ ఆలోచనలతో ప్రభావితమై స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ముఖ్యంగా కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన కృషి ప్రత్యేక గుర్తింపు పొందింది. కార్మికులకు మెరుగైన వేతనాలు, హక్కులు, గౌరవప్రదమైన పని పరిస్థితులు కల్పించాలనే లక్ష్యంతో ఉద్యమించారు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు.

రెండుసార్లు దేశానికి ప్రధానిగా..

స్వాతంత్ర్యానికి ముందే బాంబే శాసనసభకు ఎన్నికైన నందా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర్యం అనంతరం జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పలు బాధ్యతలు నిర్వహించారు. 1964 మే 27న నెహ్రూ మరణించిన తర్వాత గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. జూన్ 11 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1966లో శాస్త్రి మరణించిన తర్వాత మరోసారి తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు. ఇలా రెండుసార్లు దేశానికి ఆపద్ధర్మ ప్రధానిగా సేవలందించారు. తర్వాత ఇందిరా గాంధీ ప్రభుత్వంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

నందాకు రాజకీయ పదవులపై వ్యక్తిగత ఆశలు లేవని ఆయన జీవితాన్ని వివరించే కథనాలు చెబుతాయి. వయసు పెరిగిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుని ప్రజాసేవకు అంకితం కావాలని భావించారు. తన స్థానంలో యువతకు అవకాశం ఇవ్వాలని సూచించినట్లు కూడా చెబుతారు. హర్యానాలో పేదలు, అనాథలకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారని కథనంలో పేర్కొన్నారు. అక్కడ పాడి పరిశ్రమను కూడా నిర్వహించి, ఆదాయం సమకూర్చడంతో పాటు కొందరికి ఉపాధి కల్పించారని వివరించారు. అయితే ఆ ఆశ్రమం నిర్వహణలో విభేదాలు తలెత్తడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని కథనం చెబుతోంది. జీవిత చరమాంకంలో ఢిల్లీలోని ఓ చిన్న అద్దె ఇంట్లో భార్యతో కలిసి నందా నివసించారని ఈ కథనం వివరిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొంతకాలం అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందని పేర్కొంటోంది.

ఇవి కూడా చదవండి

ఒక రోజు ఇంటి యజమానితో అద్దె విషయంలో గొడవ జరుగుతుండగా, పక్కనే ఉన్న ఓ హిందుస్తాన్ టైమ్స్ జర్నలిస్టు అక్కడికి వచ్చారని కథనం చెబుతోంది. వృద్ధుడి పరిస్థితిని గమనించిన జర్నలిస్టు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. మొదట తన వివరాలు చెప్పడానికి నందా ఆసక్తి చూపలేదట. అయితే ఇంట్లో ఉన్న పుస్తకాలు, ఫొటోలు, పత్రాలను పరిశీలించిన జర్నలిస్టుకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందని కథనం వివరిస్తోంది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తదితర ప్రముఖులతో ఉన్న ఫొటోలతో పాటు నెహ్రూ రాసిన లేఖను చూసి, ఆ వృద్ధుడు మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా అని గుర్తించారని పేర్కొంటోంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నందా పరిస్థితిపై వార్త ప్రచురితమైందని కథనం చెబుతోంది. అనంతరం అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించారని పేర్కొంటోంది. ఆ తర్వాత ప్రభుత్వం మాజీ ప్రధానిగా ఆయనకు అవసరమైన సౌకర్యాలు కల్పించిందని వివరిస్తోంది. తర్వాత ఆయన కుమార్తె వద్దకు వెళ్లి ఆమె సంరక్షణలో జీవించారని కథనం పేర్కొంటోంది. జీవితాంతం నిరాడంబరంగా గడిపిన గుల్జారీలాల్ నందా 1998 జనవరి 15న మరణించారు. 1997లో భారత ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసింది.

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం

రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి అయినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో సాదాసీదా జీవనాన్ని ఎంచుకున్న నాయకుడిగా గుల్జారీలాల్ నందా పేరు చరిత్రలో నిలిచింది. అధికారం, హోదా, సంపద కంటే ప్రజాసేవ, విలువలు, నిజాయితీ ముఖ్యమని ఆయన జీవితం గుర్తుచేస్తుంది. రాజకీయాల్లో పదవులు చేపట్టడం గొప్ప విషయం కావచ్చు. కానీ ఆ పదవుల్లో ఉన్నప్పుడు ప్రజల పట్ల బాధ్యతగా ఉండటం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం మరింత గొప్ప విషయం. గుల్జారీలాల్ నందా జీవితం నుంచి నేటి నాయకులు, యువత నేర్చుకోవాల్సిన పాఠం ఇదే.

Follow Us