CBSC పరీక్షల్లో భారీ మార్పులు.. డిజిటల్ మూల్యాంకనానికి శ్రీకారం!
సీబీఎస్ఈ క్లాస్-12 పరీక్షల మూల్యాంకనంలో ఈసారి భారీ డిజిటల్ మార్పులు చేపట్టినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 17 లక్షల మంది విద్యార్థుల 98 లక్షల ఆన్సర్ షీట్లను ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్(OSM)’ విధానంలో మూల్యాంకనం చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ స్కాన్ చేసిన ఆన్సర్ షీట్లను చూసుకునే అవకాశం కల్పించామని, వచ్చిన లోపాలపై బాధ్యత తీసుకుని ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకనంలో ఈసారి భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు హాజరైన క్లాస్-12 పరీక్షలకు సంబంధించిన 98 లక్షల ఆన్సర్ స్క్రిప్టులను పూర్తిగా డిజిటల్ విధానంలో స్కాన్ చేసి మూల్యాంకనం చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 40 కోట్లకు పైగా పేజీలను స్కాన్ చేసి ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్(OSM)’ విధానంతో పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు అనుసరిస్తున్న ఈ విధానం విద్యార్థులకు మరింత పారదర్శకత కల్పిస్తుందని పేర్కొన్నారు.
రీ-వాల్యుయేషన్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించిన ధర్మేంద్ర ప్రధాన్.. విద్యార్థులు తమ స్కాన్ చేసిన ఆన్సర్ షీట్లను నేరుగా చూసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. మార్కులపై సందేహాలుంటే ప్రశ్నించే అవకాశం కూడా ఇచ్చామని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 4 లక్షల మంది విద్యార్థులు తమ ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని, దాదాపు 11 లక్షల కాపీలు యాక్సెస్ చేసినట్లు వెల్లడించారు.
ఈ డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ పర్యవేక్షణ కోసం ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్ సంస్థల సాంకేతిక సహకారం తీసుకున్నట్లు తెలిపారు. చెల్లింపుల కోసం ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్‌ల పేమెంట్ గేట్‌వేలను అనుసంధానం చేసినట్లు చెప్పారు. ప్రక్రియలో కొన్ని లోపాలు వెలుగులోకి వచ్చిన విషయాన్ని అంగీకరించిన కేంద్రం.. వాటిపై బాధ్యత తీసుకుంటామని, ఒక్క విద్యార్థి ఫిర్యాదు కూడా పెండింగ్‌లో ఉండకుండా పరిష్కరిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
