హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ డీఎస్సీ నియామక ప్రక్రియ వడివడిగా సాగుతోంది. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిన సర్కార్.. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్‌ను ప్రకటించింది. ఇక వారందరికీ అన్ని జిల్లాల్లో అక్టోబర్ 5 నాటికే వెరిఫికేషన్ పూర్తి చేసింది. డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు బుధవారం (అక్టోబరు 9న) సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విద్యాశాఖ నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దసరా సెలవులు ముగిసేలోపు పోస్టింగులు కూడా ఇవ్వనుంది. మెరిట్ ఆధారంగా ఏ పాఠశాలలో పనిచేయాలో డీఈవోలు ఉత్తర్వులు ఇస్తారు. నియామకపత్రాల అందజేత కార్యక్రమం ముగిసిన వెంటనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.
ఇక రాష్ట్రంలో విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టబరు 14తో ముగియనున్నాయి. సెలవులు ముగిసే నాటికి జిల్లాల వారీగా కౌన్సెలింగ్ పూర్తిచేసి, పోస్టింగులు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కోర్టు కేసుల కారణంగా కొన్ని జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీ పోస్టులకు ఎంపికైన వారికి నియామకపత్రాలను అక్టోబరు 9న ఇవ్వడానికి వీలుకాదని అన్నారు. ఒక రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 10 వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్నందున డీఈవోల ఆధ్వర్యంలో 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పత్రాలను అందజేస్తారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియానికి వచ్చేందుకు అక్టోబరు 9న ఆయా కలెక్టరేట్ల నుంచి బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎంపికైన వారిలో పాలిచ్చే తల్లులు, గర్భిణులు, దివ్యాంగులు ఉంటే వారి వెంట ఒకరిని వెంట తెచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2025 దరఖాస్తుల స్వీకరణ గడువును మరోమారు పెంచినట్లు ఐఐటీ రూర్కీ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన వెలువరించింది. గతంలో ఉచ్చిన ప్రకటన మేరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు ప్రక్రియ గడువు అక్టోబర్ 7వ తేదీతో ముగిసినప్పటికీ.. అక్టోబర్ 11వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు ఐఐటీ రూర్కీ వెల్లడించింది. ఇక గేట్ 2025 పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. గేట్ స్కోర్ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయన్న సంగతి తెలిసిందే.