CBSE Exam 2021: కరోనా సెకండ్ వేవ్ మరోసారి దేశాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మిగతా రంగాలపై కంటే ఎక్కువగా విద్యారంగంపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలను మూసివేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే విద్యా సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పరీక్షల నిర్వహణపై పడింది.
ఈ క్రమంలోనే పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్ 2021ని వాయిదా వేయాలి లేదా రద్దుచేయాలని కోరుతున్నారు. సీబీఎస్‌ఈ పరీక్షలను మే నెలలో ఏర్పాటు చేయాలిని లేని పరిస్థితుల్లో ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించాలని గత కొన్ని రోజులుగా వాదన వినిపిస్తోంది. తాజాగా వీరి గొంతుకకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మద్దతు నిలిచారు. కరోనా ఉగ్రరూపం దాల్చుతోన్న నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయడం లేదా ఇతర మార్గాల్లో (ఆన్‌లైన్) నిర్వహించాలని కోరారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు పరీక్షలు చిన్నారులపై ఒత్తిడిని పెంచుతుందని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే విద్యార్థుల నుంచి వస్తోన్న డిమాండ్‌పై సీబీఎస్‌ఈ అధికారులు స్పందించారు. పరీక్షల నిర్వహణలో అన్ని రకాల కోవిడ్ నిబంధనలను పాటిస్తామని, ఇందులో భాగంగానే పరీక్ష కేంద్రాలను 40 నుంచి 50 శాతం మేర పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చిన్నారుల్లోనూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మరి సీబీఎస్‌ఈ బోర్డ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా.? లేదా పరీక్షలు నిర్వహిస్తోందో చూడాలి.