CBSE Open Book Exams: సీబీఎస్సీ 10,12వ తరగతులకు ఓపెన్‌ బుక్‌ పరీక్ష విధానం.. క్లారిటీ ఇచ్చిన బోర్డు

|

Nov 20, 2024 | 4:54 PM

2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్సీ పది, పన్నెండో తరగతులకు నిర్వహించనున్న పరీక్షలను ఓపెన్ బుక్ విధానంలో జరపనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సీబీఎస్సీ బోర్డు తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏం చెప్పిందంటే..

CBSE Open Book Exams: సీబీఎస్సీ 10,12వ తరగతులకు ఓపెన్‌ బుక్‌ పరీక్ష విధానం.. క్లారిటీ ఇచ్చిన బోర్డు
CBSE Open Book Exams
Follow us on

న్యూఢిల్లీ, నవంబర్ 20: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పది, పన్నెండో తరగతుల పరీక్షా విధానంలో మార్పులు చేసిందని గత కొంత కాలంగా సోషల్‌ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. పైగా సీబీఎస్సీ సిలబస్‌ కూడా భారీగా తగ్గించిందని విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల (వదంతులు)ను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఖండించింది. సిలబస్‌ను 15 శాతం వరకు తగ్గిస్తున్నారని, 10, 12 తరగతుల పరీక్షలను 2025లో ఓపెన్‌ బుక్‌ విధానంలో నిర్వహిస్తారంటూ వచ్చిన వార్తలన్నీ ఒట్టి పుకార్లని కొట్టిపారేసింది. ఇలాంటి ఫేక్‌ వార్తలను నమ్మొద్దని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. మంగళవారం ఈ మేరకు సీబీఎస్‌ఈ ప్రాంతీయ ఆఫీసర్‌ వికాస్‌కుమార్‌ అగర్వాల్‌ ప్రకటన విడుదల చేశారు.

సీబీఎస్సీ తన పరీక్షా విధానం, అంతర్గత మూల్యాంకన విధానంలో ఎలాంటి మార్పు చేయలేదని, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏడీ తాము జారీ చేయలేదని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో వచ్చే ఇలాంటి ఫేక్‌ వార్తలను విశ్వసించవద్దని, CBSE అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా వచ్చే ప్రచురణలను మాత్రమే నమ్మాలని ప్రాంతీయ అధికారి వికాస్ కుమార్ అగర్వాల్‌ సూచించారు. కాగా ఇండోర్‌లో ఇటీవల జరిగిన ఎడ్యుకేషనల్ సమ్మిట్ సందర్భంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు నకిలీ వార్తలు సృష్టించారు. ఇలాంటి ఫేక్‌ వార్తలు క్రియేట్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.

ఇప్పటికే పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్, థియరీ పరీక్షల తేదీలు ఇప్పటికే విడుదలయ్యాయి కూడా. వచ్చే ఏడాది (2025) జనవరిలో ప్రాక్టికల్స్, ఫిబ్రవరి 15 నుంచి థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి రెండవ వారంలో ముగియనున్నాయి. ఇక 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2025 మొదటి వారంలో ముగియనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.