IIT placements
ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఏడాది ఐఐటీ నియామకాల్లో భారీ ప్యాకేజీతో ఆఫర్లు వెల్లువెత్తాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి కొలువుల సంఖ్య కూడా ఎక్కువే. సాధారణంగా దేశంలో ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ల ప్రక్రియ ఆగస్టు నుంచే మొదలవుతుంది. ఐఐటీల్లో డిసెంబరు నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా డిసెంబరు 1 నుంచి 15 వరకు పలు ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ జరుగుతుంది.
డిసెంబరు 1వ తేదీన ప్రముఖ ఐఐటీల్లో ఎన్ని జాబ్స్ లభించాయంటే..
- ఐఐటీ మద్రాస్‌లో తొలి రోజు 445 మందికి కొలువులు దక్కాయి. అందులో 25 మంది స్వదేశంలోనే కోటి రూపాయలకుపైగా వార్షిక వేతనంతో ఎంపికయ్యారు. నాలుగు అంతర్జాతీయ కంపెనీల్లో 15 మందికి ఉద్యోగాలు లభించాయి.
- ఐఐటీ బాంబేలో 46 కంపెనీలు ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 250 ఆఫర్లు ఇచ్చారు. 175 మంది కొలువుల్లో చేరేందుకు అంగీకరించారు. ఐతే ఈ ఏడాది వేతన ప్యాకేజీలో పెద్ద మార్పు లేదని ఐఐటీ బాంబే తెలిపింది.
- ఐఐటీ ఖరగ్‌పుర్‌లో 760 మందికి ఆఫర్లు దక్కాయి. వీటిల్లో 16 విదేశీ ఆఫర్లు ఉన్నాయి. అంతర్జాతీయ కొలువులకు ఎంపికైన వారిలో అత్యధిక ప్యాకేజీ రూ.2.60 కోట్లు.
- ఐఐటీ వారణాసిలో రెండు రోజుల్లో 640 మంది ఎంపికయ్యారు. మొత్తం 173 కంపెనీలు పాల్గొనగా.. అత్యధిక వార్షిక వేతనం రూ.1.20 కోట్లు.
- ఐఐటీ ఢిల్లీలో 650 మంది కొలువులకు ఎంపికయ్యారు. వీటిలో 50 మంది రూ.కోటి వేతనం అందుకోనున్నారు. మరో ముగ్గురికి రూ.3.6 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం వరించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.