అమరావతి, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది అంటే 84.67 శాతం మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే పరీక్షకు మాత్రం 91,463 మంది మాత్రమే హాజరయ్యారు. పేపర్ 1 పరీక్షకు 91,463 అంటే 72.55 శాతం మంది, పేపర్ 2 పరీక్షకు 90,777 అంటే 72 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారన్న సంగతి తెలిసిందే.
తాజా ఫలితాల్లో 1:50 చొప్పున పరీక్ష రాసిన వాళ్లలో 4,496 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరితోపాటు గ్రూప్ 1 ఫలితాల్లో ట్యాంపరింగ్, ఓఎంఆర్ షీట్‌పై బుక్‌లెట్ సీరియల్ నంబర్లు లేకపోవడం, మల్టిపుల్ బుక్‌లెట్ సిరీస్ నంబర్లు నమోదు చేయడం వంటి వివిధ కారణాల వల్ల 567 మంది అభ్యర్ధులు రిజెక్ట్ అవగా వారి వివరాలను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్ 1 ఫలితాలతోపాటు పేపర్ 1, 2లకు సంబంధించిన తుది ఆన్సర్ ‘కీ’లను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన 24 రోజుల్లోనే కమిషన్ ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.
కాగా మార్చి 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఈ నియామక ప్రక్రియను చేపడుతోంది. తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షలు సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 4,496 మంది అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.